TDP on Deputy CM post: కూటమిలో కొత్త నినాదం వినిపిస్తోంది. ప్రధానంగా టీడీపీలో కొత్త రాగం ఎత్తుకున్నారు టీడీపీ శ్రేణులు. కొత్త రాగం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని టాక్. ఓ వైపు ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రోజురోజుకు ప్రజాదరణ పొందుతున్నారు. అందుకే టీడీపీలో ఒక్కసారిగా ఆ డిమాండ్ వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. పవన్ కు చెక్ పెట్టేందుకు ప్లాన్ అమలులో భాగంగా ఈ రకమైన డిమాండ్ వినిపిస్తుందని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరి ఆ డిమాండ్ ఏమిటి? దాని వెనుక ఉన్న కథ ఏమిటో చూద్దాం.
కూటమిలో టీడీపీ, జనసేన మైత్రి బంధం చూసి ఇరుపార్టీల నాయకులు మురిసిపోతుంటారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించి సీఎం చంద్రబాబు తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఎప్పుడు వీరిద్దరు కలిసినా ఆ పలకరింపులు కూడ వేరు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదన్నది ఎవరూ కాదనలేని విషయం. అందుకే సీఎం చంద్రబాబు కూడ పవన్ కు ఇచ్చే ప్రాధాన్యత కూడ అదే స్థాయిలో ఉంటుంది.
అలాగే పవన్ కూడ సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చినా అనతి కాలంలోనే రాజకీయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ, నిరంతరం ప్రజలతో మమేకమవుతూ తన చరిష్మాను పవన్ పెంచుకున్నారు.
తన ప్రసంగంలో కూడ గతానికి నేటికీ చాలా తేడా ఉందని కూడ జనసేన అభిమానుల అభిప్రాయం. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడ పర్యటించని మన్యంలో పవన్ పర్యటన అయితే ఓ రేంజ్ లో పేరు తెచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు పర్యటనతో ఆగకుండ అక్కడ అభివృద్ది పనులు కూడ అంతేస్థాయిలో సాగిస్తున్నారు పవన్. ఇలా పవన్ ఏది చేసినా ఆయన క్రేజ్ రోజురోజుకు ఆకాశాన్ని తాకుతూ ఉందన్నది విశ్లేషకుల అంచనా.
ఇదే ఇప్పుడు టీడీపీలోని నాయకులకు రుచించడం లేదో ఏమో కానీ, ఉన్నట్లుండి మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న మహాసేన రాజేష్, నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డిలు ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా సీఎం చంద్రబాబు ముందే లోకేష్ అంశాన్ని లేవనెత్తారు. రోజురోజుకూ లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ అధికం అవుతుండగా, కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు ఎన్నో సమీకరణాలు పరిశీలించి మంత్రి పదవి వరకే లోకేష్ ను స్థిరపరిచారని, ఎవరెన్ని చెప్పినా ఆ ప్రయత్నం జరిగేది లేదంటూ ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ బలోపేతం అవుతుండడంతోనే, లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ తెచ్చి సమాన హోదా కల్పించాలని టీడీపీ క్యాడర్ కోరుతున్నట్లు కూడ ఏపీలో మరో ప్రచారం ఊపందుకుంది. మరి టీడీపీ అధినాయకత్వం వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కొత్త తలనొప్పులు వస్తాయని కుండబద్దలు కొట్టేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు ఏం జరుగుతుందో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే.