“చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా? మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా?” సత్తెనపల్లి పర్యటనలో జగన్ చేసిన కీలక వ్యాఖ్యలివి. కమ్మ సామాజిక వర్గం గురించి, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల గురించి ఆయన అనూహ్యంగా స్పందించారు. వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని టీడీపీ ఇబ్బంది పెట్టిందంటూ ఓ లిస్ట్ చదివి వినిపించారు. అకస్మాత్తుగా ఆ సామాజిక వర్గంపై జగన్ కు ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందనేదే ఇప్పుడు అసలు పాయింట్. అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్ కమ్మ వర్గం వారికి చేసిన మేలేంటి..? కేవలం చంద్రబాబుని తిట్టేందుకే వారిని వాడుకున్నారు కదా..? అలా తిట్టి తిట్టే ఇప్పుడు వారు టీడీపీకి టార్గెట్ అయ్యారు కదా..? అంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్న కమ్మవారంతా చంద్రబాబు బాధితులు కాదు, జగన్ బాధితులు అంటున్నారు టీడీపీ నేతలు. మరి దీనికి వైసీపీ వద్ద సమాధానం ఉందా? అంటే అనుమానమే.
జగన్ చెప్పిన లిస్ట్..
చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను ఆయన వేధిస్తున్నారని మండిపడ్డారు జగన్. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారని, కొడాలి నానిపై కేసులు పెట్టి ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టారని, అబ్బయ్య చౌదరిపై కూడా కేసులు పెట్టారని, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ కి వైజాగ్ లో ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్-కృష్ణవేణి, ఇంటూరి రవి, బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణ మురళి.. ఇలా జగన్ పెద్ద లిస్ట్ చదివి వినిపించారు. అయితే ఇక్కడ వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి చంద్రబాబు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు కూడా. దేవినేని అవినాష్ కి కూడా చంద్రబాబే అవకాశాలిచ్చారు. కానీ వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబుని తిట్టేందుకే వారందర్నీ ఉపయోగించుకున్నారు జగన్. వైరి వర్గంలో ఉన్న నేతల్ని, వారి వారి సామాజిక వర్గం వారిద్వారానే తిట్టించేవారు. తీరా ఇప్పుడు వారిని చంద్రబాబు వేధిస్తుందంటూ మొసలి కన్నీరు కార్చడం మరో డ్రామా అంటున్నారు టీడీపీ నేతలు.
ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు ఏంటి అభ్యంతరం?
ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావుని పొట్టన పెట్టుకున్నారు @ncbn ?
చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరైనా కమ్మవారు మాట్లాడితే వారిని హింసించి నరకం చూపిస్తూ.. ఆత్మహత్య చేసుకునే స్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు?
-వైయస్ జగన్… pic.twitter.com/zbQ0kG5eAt
— YSR Congress Party (@YSRCParty) June 18, 2025
సినిమా చూపిస్తాం..
ఇక యదావిధిగానే జగన్ నాలుగేళ్ల తర్వాత తమదే అధికారం అని మరోసారి నొక్కి వక్కాణించారు. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దంటూ అధికారులకు సలహా ఇచ్చిన జగన్, ఎల్లకాలం బాబు సీఎంగా ఉండరని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ సినిమా చూపిస్తామన్నారు. తప్పు చేసిన వారందర్నీ బోను ఎక్కిస్తామన్నారు. చంద్రబాబు ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు ఇప్పటికే కూటమిపై విసిగిపోయారని, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని.. ప్రజలు తప్పకుండా ఆయనకు బుద్ధి చెబుతారని, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారని చెప్పారు జగన్.
జగన్ పై విమర్శలు..
సత్తెనపల్లి పర్యటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళ్లే క్రమంలో జగన్ చేసిన కుల వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పర్యటనకు వచ్చిన ప్రతిసారీ జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు టీడీపీ నేతలు. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.