Jagan on Vamsi Arrest: ఏపీలో అధికారం పోయినా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వాయిస్ ఏమాత్రం మారలేదు. కీలక నేతల అరెస్ట్ కావడంతో అధినేత తట్టుకోలేక పోతున్నారు. ఫలితంగా పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. తమ వాళ్లను అరెస్ట్ చేయకూడదన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఆక్రమ కేసులు పెట్టిన అధికారులందరినీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలూడదీసి నిలబెడతామన్నారు.
ములాఖత్ తర్వాత జగన్ పలుకులు
రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతోందన్నారు మాజీ సీఎం. వంశీపై కక్షతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు జగన్. జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు చాలా దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ఫాల్స్ కేసుగా చెప్పుకొచ్చారు.
అరెస్ట్ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయినట్టు కనిపిస్తోందన్నారు మాజీ సీఎం. వంశీ మీద తప్పుడు కేసులు బనాయించారని వివరించారు. పట్టాభి చేత వల్లభనేని వంశీని చంద్రబాబు భరించలేని నానా మాటలు ఆడించారన్నారు. అసలు వంశీని రెచ్చగొట్టిందే టీడీపీ నేత పట్టాభి అని చెప్పుకొచ్చారు.
వల్లభనేని వంశీని చూస్తే సీఎం చంద్రబాబుకు అసూయగా ఉందన్నారు జగన్. చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామర్‌గా ఉన్నాడనే ఆయనపై కేసు పెట్టించారని వ్యాఖ్యానించారు. అవినాష్, నాని సైతం లోకేష్ కంటే అందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏదో ఒకరోజు వీళ్లను సైతం టార్గెట్ చేస్తామని చెప్పకనే చెప్పారు. చంద్రబాబు తన సామాజిక వర్గంలో మరొకరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
ALSO READ: నాకు రోజుకొక అమ్మాయి కావాలి.. కిరణ రాయల్ ఆడియో వైరల్
మరోసారి పోలీసులకు వార్నింగ్
ఇదే క్రమంలో పోలీసు అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత. పోలీసులు తమ టోపీపై ఉండే మూడు సింహాలకు సెల్యూట్ చేస్తే బాగుండేదన్నారు. అడ్డమైన నాయకులకు తలవంచడం బాగుందన్నారు. అధికార పార్టీ చెప్పినట్టు ఆక్రమ కేసులు పెట్టిన అధికారులందర్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలూడదీసి నిలబెడతామన్నారు. ఎవర్నీ వదలబోమని హెచ్చరించారు. రిటైర్ అయినా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తామని కాసింత ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులను జగన్ హెచ్చరించడం ఇది రెండోసారి. గతంలో మీడియా సమావేశంలో ఇలాగే హెచ్చరించిన విషయం తెల్సిందే.
ఆనాడు ఏం జరిగింది?
పోలీసులు పెట్టిన కేసు ఏంటని ప్రశ్నించారాయన. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారాయన. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారన్నారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందన్నారు.
ప్రజాస్వామ్యం ఎక్కడ?
టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు జగన్. పిడుగురాళ్ల మున్సిపాలిటీ, తిరుపతి కార్పొరేషన్లలో అన్యాయంగా వైస్ ఛైర్మన్ పదవులను టీడీపీ లాక్కుందని మండిపడ్డారు. తునిలోనూ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకోసమే అక్కడ ఎన్నికను వాయిదా వేస్తూ వస్తున్నట్లు వివరించారు. పోలీసులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, చివరకు నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు టీడీపీ కార్యాలయం తగలబడలేదన్నారు. వంశీకి బెయిల్ రాకూడదని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు. వంశీకి బెయిల్ రావని ముందుగా వెల్లడించారాయన. ఇంకా ఇప్పటివరకు వంశీని కస్టడీలోకి పోలీసులు తీసుకోలేదు. దీనిపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసిన విషయం తెల్సిందే.