Jagan: ఏపీ ప్రజలు ఊహించినట్టుగానే జరిగింది. అమరావతి పునఃప్రారంభోత్సవ సభకు మాజీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. గురువారం సాయంత్రం ఆయన బెంగుళూరుకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడే రెస్టు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల మాట. అయితే అధినేత జగన్ నిర్ణయంపై ఆ పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారని అంటున్నారు.
గడిచిన ఐదేళ్లలో ఆగిపోయిన రాజధాని అమరావతి పనులను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు చంద్రబాబు సర్కార్ 10 నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. అమరావతిలో ఎక్కడ చూసినా ఒకప్పుడు నీరు కనిపించేది. గతంలో కట్టిన పునాదులు మునిగిపోయాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయి, నార్మల్ పరిస్థితికి చేరింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ పనులు ప్రారంభించగానే రేపో మాపో నిర్మాణాలు జరగనున్నాయి.
ప్రత్యేకంగా కమిటీ
ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. ముగ్గురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అమరావతి పునఃప్రారంభం సభకు రావాలని మాజీ సీఎం జగన్‌కు ఆహ్వానం పంపింది ప్రభుత్వం. బుధవారం ఇన్విటేషన్ పంపారు. దాన్ని తీసుకోవడం ఇష్టంలేక దూరంగా ఉండి పోయారు.
చివరకు పీఎకు ఆహ్వానం అందజేసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సభకు రావడం ఇష్టంలేక జగన్, గురువారం సాయంత్రం తాడేపల్లి నుంచి బెంగుళూరుకి వెళ్లిపోయారు. స్వయంగా ప్రధాని హాజరవుతున్నా రావడానికి ఆసక్తి చూపలేదు. గడిచిన ఐదేళ్లలో చేయాల్సిన తప్పులు చేసి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని భావించి, డ్రాపైనట్లు ఆ పార్టీ వర్గాల మాట.
ALSO READ: అమరావతిలో 20 అడుగుల పైలాన్, ప్రత్యేకత ఇదే
ఏకైక రాజధాని కాన్సెప్ట్ మా విధానం కాదని, మాకు మూడు ఉండాల్సిందేనని అంటున్నారు కొందరు నేతలు. 2017లో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి దూరంగానే ఉన్నారు వైసీపీ అధినేత జగన్. అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమానికి రావడానికి ఇష్టంలేక దూరంగా ఉన్నారని అప్పట్లో అనుకున్నారు. తీరా వైసీపీ అధికారంలోకి జగన్ మాస్టర్ ప్లాన్ టీడీపీ నేతలతోపాటు ప్రజలకు అర్థమైంది.
జగన్ ఆలోచన అదే?
జగన్‌కు వ్యతిరేకంగా రాజధాని రైతులు అలుపెరగని పోరాటాలు చేశారు. అయినా వారందర్నీ ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇంత జరిగిన తర్వాత సభకు వెళ్లడం సరికాదని భావించి డ్రాపనట్లు చెబుతున్నారు నేతలు. కాకపోతే దీనిపై వైసీపీ కొత్త పల్లవిని అందుకుంది. అమరావతి అంటే కేవలం 12 గ్రామాలు కాదని, ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే రాష్ట్రమంతా కాదని అంటోంది వైసీపీ.
జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోస్తున్నారు టీడీపీ మద్దతుదారులు. నలుగురు ఏడ్చిన దగ్గరికి మాత్రమే జగన్ వస్తారని, సంతోషంగా ఉన్న దగ్గరకు రారని అంటున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ బయటకు వచ్చిన సందర్భాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కడైతే మనుషులు చనిపోతారో అక్కడికి మాత్రమే వస్తారని అంటున్నారు. ప్రజా రాజధాని అమరావతి కోసం జగన్ ఏడుస్తూనే ఉంటారని, అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంటుందని అంటున్నారు.