ఎన్నికల ఫలితాల తర్వాత ఫస్ట్ టైమ్ జగన్ పశ్చాత్తాప పడ్డారు. ఇన్నాళ్లూ ఈవీఎంలపై నిందలు వేసిన జగన్, తొలిసారి తమవారి తప్పుల్ని ఎత్తి చూపారు. చేసింది చెప్పుకోవడం తమ చేతకాలేదన్నారు. అదే తమ ప్రాబ్లమ్ అని మీడియా ముందే తేల్చి చెప్పారు. చేసిన మంచి ఇంకా చాలా ఉందని, దాన్ని చూపించడం తమ వాళ్లకు ఇంకా చేతకావడం లేదని, ఇప్పటికీ వారు గేర్ మార్చలేదని, సరైన గేర్ లోకి రాలేదని.. సొంత టీమ్ పైనే సెటైర్లు పేల్చారు.
అసలేం జరిగింది..?
జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కల్యాణ్ అయినా ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు కొంత సమాచారం తీసుకుంటారు. దానికి సంబంధించిన వీడియో ఫైల్స్, మీడియాకు చూపించాల్సిన ఫొటోలు, పేపర్ క్లిప్పులు సేకరించి పెట్టుకుంటారు. ఇదంతా వారి పీఆర్ టీమ్ చూసుకుంటుంది. పీఆర్ టీమ్ ఎంత బలంగా ఉంటే, ఆ నాయకుడి స్పీచ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. గణాంకాలు, ఇతర ఉదాహరణలు ఎక్కువగా ఉంటాయి. జగన్ కూడా బుధవారం ఇలానే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తమ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ప్రయత్నం జరిగిందని, గతంలో సీఎంగా ఉన్నా కూడా చంద్రబాబు హయాంలో ఏమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ హయాంలో నిర్మించిన భవనాల ఫొటోలు ఆయన ప్రదర్శించారు. ఆ ఫొటోలు ఇంకా ఉండాలన్నారు. కొన్ని ఫొటోలు ఇక్కడ చూపించలేకపోయామన్నారు. ఈ క్రమంలో జగన్ తన అసంతృప్తిని బయటపెట్టారు. చేసింది చెప్పుకోవడం తమ చేత కాదని, అదే తమ ప్రాబ్లమ్ అని అన్నారాయన. తమవాళ్లు ఇంకా గేర్ లోకి రాలేదని చెప్పుకొచ్చారు.
రియలైజేషన్..
2024 ఎన్నికలు వైసీపీకి గొప్ప గుణపాఠం లాంటివి. వైనాట్ 175 అంటూ దూకుడుగా వెళ్లిన జగన్ 11 స్థానాలకు పరిమితం కావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వైసీపీ ఓడిపోతుందని అంచనావేసిన వారు కూడా ఈ స్థాయి దారుణ పరాభవాన్ని మాత్రం ఊహించి ఉండరు. అదే సమయంలో జగన్ కి పూర్తిగా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అప్పటికప్పుడు కారణం ఏం చెప్పాలో తెలియక ఈవీఎంలపై నెపం నెట్టేశారు. ఈవీఎంలను మేనేజ్ చేసి ఉంటే ఆ 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చి ఉండేవి కావని కూటమి నేతల వాదన. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ప్రజలు జగన్ ని, ఆయన టీమ్ ని నిర్ద్వందంగా తిరస్కరించారనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఈవీఎంలదే తప్పు అయితే, 2029లో ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పుడే మనం ఊహించగలం. అదే సమయంలో జగన్ 2019 ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే జరిగాయనే నిజాన్ని మాత్రం మరచిపోతున్నారు. సో ఇక్కడ తప్పు ఎవరిది అనే తర్జనభర్జన కంటే వచ్చే ఎన్నికలనాటికి ఎలా సమాయత్తం కావాలనేదే అసలు పాయింట్.
జగన్ ఫ్యూచర్ ప్లాన్..
మొత్తానికి జగన్ తన తప్పు తెలుసుకున్నారని తాజా ప్రెస్ మీట్ తో అర్థమవుతోంది. అయితే ఇక్కడ ప్రచారం వల్లే అంతా జరిగిపోతుందని అనుకోలేం. ప్రచారంతోపాటు, ప్రజలు నిజంగానే మంచి జరిగితే వారు కచ్చితంగా గుర్తుంచుకుని మరీ అదే పార్టీనికి తిరిగి ఎన్నుకుంటారు. ఆ లోపాలను జగన్ సరిదిద్దుకోవాలి. అయితే జగన్ హుషారయితే సరిపోదు, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తేనే ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారు. ప్రజలకు ఆ ఆలోచన రాకుండా కూటమి పాలన కొనసాగితే మాత్రం జగన్ ఎంత ప్రయత్నించినా 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టం అని అంటున్నారు విశ్లేషకులు.