ఆమధ్య వెన్నుపోటు దినోత్సవం అంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుని గుర్తు చేసుకుంటూ వైసీపీ హడావిడి చేసింది. ఆరోజు వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. జగన్ మాత్రం బెంగళూరులో రెస్ట్ తీసుకున్నారు. నిన్న యువతపోరు పేరుతో వైసీపీ మరోసారి రచ్చ చేసింది. యువతకోసం అంటూ నేతలు రోడ్డెక్కారు. యధావిధిగా జగన్ బెంగళూరులో రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అసలు జనంలోకి రావాల్సిన జగన్ అక్కడ ఎందుకు ఉంటున్నారు. కేవలం పరామర్శలకు మాత్రమే ఆయన ఏపీకి రావడమేంటి..? నిరసన కార్యక్రమాలంటే జగన్ కి పట్టవా..? పదే పదే అదే తప్పు చేస్తున్నారు జగన్.
కేరాఫ్ బెంగళూరు..
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ ని నాన్ రెసిడెంట్ లీడర్స్ అంటూ ఎగతాళి చేశారు వైసీపీ నేతలు. మరిప్పుడు జగన్ ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. వారంలో ఒకటీ రెండు రోజులు తాడేపల్లిలో, మిగతా రోజులు బెంగళూరులో. ఇదీ జగన్ షెడ్యూల్. పోనీ అక్కడేమైనా పార్టీ వ్యవహారాల్లో తలమునకలై ఉంటున్నారా అంటే, అదీ లేదు. వైసీపీ నేతలెవరికీ బెంగళూరు అపాయింట్ మెంట్లు లేవు. జగన్ ఇక్కడికి వచ్చినప్పుడే ఎవైరనా కలవాలన్నా, మాట్లాడాలన్నా అవకాశం దొరుకుతుంది. అందుకే వారంతా జగన్ ఎప్పుడెప్పుడు ఏపీకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అధికారం కోల్పోయి ఏడాది పూర్తయినా జగన్ లో మార్పు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నాయకుడు లేకుండానే..
ఫీజుపోరు, రైతు పోరు, యువతపోరు, వెన్నుపోటు.. అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడమే కానీ, వాటిలో అధినాయకుడు పాల్గొనకపోవడంతో క్యాడర్ లో నిరుత్సాహం అలముకొంటోంది. గతంలో వెన్నుపోటు దినోత్సవంలో అయినా కనీసం జగన్ పాల్గొంటారని అనుకున్నారంతా. కానీ ఆయన బెంగళూరు వదిలి రాలేదు. తాజాగా యువతపోరులో కూడా వైసీపీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం పెద్ద సక్సెస్ అంటూ వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి ఆ సక్సెస్ ఫుల్ కార్యక్రమంలో జగన్ ఉన్నారా..? ఈ ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానం లేదు. జగన్ లేకుండా జరిగే నిరసన కార్యక్రమాలను ప్రజలు పట్టించుకుంటారా లేదా అనేదే అసలు ప్రశ్న.
ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరాటానికి పిలుపునిచ్చిన సందర్భంలో, కడపలో వైయస్సార్ సీపీ యువత ఆధ్వర్యంలో శక్తివంతమైన ర్యాలీ నిర్వహించారు.
జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ… pic.twitter.com/84LVM5qwEu
— YSR Congress Party (@YSRCParty) June 23, 2025
ట్వీట్ పోరు..
నిరసన కార్యక్రమాలతో కార్యకర్తల్ని, నేతల్ని బిజీగా ఉంచిన జగన్ తాను మాత్రం ట్విట్టర్లో బిజీ అయిపోతున్నారు. తన కారుకిందపడి సింగయ్య అనే వృద్ధుడు మరణించిన విషయంపై కూడా కేవలం ట్విట్టర్లోనే స్పందించారు జగన్. రప్ప రప్ప అంటూ సంచలన కామెంట్లు చేసేటప్పుడు మాత్రం జగన్ మీడియా ముందుకొస్తారు. తన కారుకిందపడి వ్యక్తి చనిపోయిన వీడియో బయటకొస్తే మాత్రం వివరణ ఇవ్వడానికి సోషల్ మీడియాని వాడుకుంటారు. ఇలాంటి తప్పులు చేస్తూ జనంలో జగన్ మరింత పలుచన అవుతున్నారంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
జగన్ వస్తేనే..
2019 ఎన్నికల ప్రచారంలో జగన్ నిజంగానే జనంలోకి వచ్చారు, ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల టైమ్ లో ఆయనకంత తీరిక లేదు. సభలు, సమావేశాల పేరుతో జనాన్నే తన దగ్గరకు పిలిపించుకున్నారు. నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ లాజిక్ లేని ప్రశ్నలు అడిగారు, వైనాట్ 175 అంటూ అత్యాశకు పోయారు. చివరకు 11తో కిందపడ్డారు. దీన్నిబట్టి జగన్ తెలుసుకోవాల్సింది ఏంటి..? జనం తన గురించి ఏమనుకుంటున్నారు..? వైసీపీకి వారు అండగా నిలబడాలంటే తాను ఏం చేయాలి..? గత ఎన్నికల్లో జరిగిన తప్పులేంటి..? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి..? ఇలా ఆలోచించాల్సిన జగన్ మాత్రం కేవలం పరామర్శలకోసమే బెంగళూరు దాటి బయటకు రావడం ఆశ్చర్యంగా ఉంది. జనం సంగతి పక్కనపెడితే, సొంత పార్టీ నేతలే జగన్ వైఖరితో విసిగిపోతున్నట్టు తెలుస్తోంది.