రప్పా.. రప్పా.. ఇప్పుడు ఇది పుష్ప డైలాగ్ కాదు. దీన్ని వైసీపీ పార్టీ ఎప్పుడో హైజాక్ చేసేసింది. వీరి నినాదం ఇప్పుడు ఏపీ అభివృద్ధి కాదు.. ‘రప్పా.. రప్పా’. అందుకే వారి బ్యానర్లలో ఈ నినాదం తప్పనిసరిగా మారిపోయింది. 11 సీట్లతో తమకు ఈ గతి పట్టించిన ప్రజలపై కక్ష సాధింపో.. లేదా ఆ స్థాయిలో విజయం సాధించిన తమ ప్రత్యర్థి పార్టీలపై ప్రతీకారమో… కారణం ఏదైనా గానీ.. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగనే స్వయంగా తమ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారు. అదే మాట ఇతర నేతలు అనుసరిస్తున్నారు. తమ అధినేతనే దైవంగా భావించే కార్యకర్తలు.. ‘రప్పా రప్పా’ను శిరోధార్యంగా భావించి.. దాన్ని అమలు చేసే బాధ్యతను భుజాన్న వేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..
జగన్‌కు యువత నుంచి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఆయన అభిమానించేవారిలో ఎక్కువ శాతం వారే. ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు. జగన్‌కు వారే బలం. అయితే దీన్ని అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ టీమ్ విఫలమవుతుందనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ ఈ విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఏదో క్యాచీగా ఉంది కదా అని సినిమా డైలాగులు వాడేస్తూ యూత్‌ను ఆకట్టుకోవచ్చు. కానీ, అది వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆలోచించడం లేదు. ఇందుకు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులే నిదర్శనం. ఇప్పుడు ఏపీలో ఏ వైసీపీ పోస్టర్ చూసినా రప్ప రప్పా డైలాగే కనిపిస్తోంది. అది వారి పార్టీ నినాదంలా మారిపోయింది. అయితే, ఇది భవిష్యత్తులో యువతను కత్తులు పట్టుకుని వీధుల్లోకి తిప్పేలా చేస్తుందనే విషయాన్ని వైసీపీ పెద్దలు గ్రహించలేకపోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ కార్యకర్తల భవిష్యత్తును వారే చేతులారా నాశనం చేస్తున్నారు. అధినేత స్థానంలో ఉన్న జగనే రప్పా రప్పా అంటే.. ఇక కుర్రాళ్లు ఊరుకుంటారా? రాజే అలా ఉంటే ఇక అనుచరులు ఏ స్థాయిలో రెచ్చిపోతారనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
‘‘మీరు మాకు మళ్లీ అధికారం ఇవ్వండి. మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని అంటే.. జనాలకు నచ్చుతుందా? ముఖ్యంగా ఆ పార్టీ అధినేతే, మాజీ ముఖ్యం మంత్రి స్వయంగా ఆ మాటలంటే.. హుందాగా ఉంటుందా? ఈ ప్రశ్నే వైసీపీ నేతలను అడిగితే ఏం సమాధానం చెబుతున్నారో తెలుసా? ‘‘టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మా నేతలను అరెస్టులతో వేధిస్తున్నారు. అందుకే, మే అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాం’’ అంటున్నారు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేసిందిగా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. వారి మంత్రులు చేసే పనులు గురించి కాకుండా.. టీడీపీ, జనసేనని లక్ష్యంగా చేసుకుంటూ బూతులతో రెచ్చిపోవడమే కనిపించింది. తమ స్థాయిని దిగజారి మరీ వ్యక్తిగత దూషణలకు దిగారు. వైసీపీ ఘోర ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ప్రజలెప్పుడు తమకు ఏ లాభం చేకురుతుందో అని ఆలోచిస్తారు గానీ.. పగలు, ప్రతీకారాలు తీర్చుకోవాలని కోరుకోరు. ఆ విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోతున్నారు. ముఖ్యంగా జగన్. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్‌లో.. రప్పా రప్పా నరుకుతామని తమవాళ్లు సరదా పడుతున్నారని, అందులో తప్పేం ఉందని అనడం.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది. దాని ప్రభావమే ఇప్పుడు రాష్ట్రమంతా పాకింది. రప్పా.. రప్పా.. అనేది వారి పార్టీ నినాదంగా మారిపోయింది. దీన్ని మొదలుపెట్టింది జగనే కాబట్టి.. ముగించాల్సింది కూడా ఆయనే. కానీ, ఆ పరిస్థితులేవీ కనిపించడం లేదు. రానున్న రోజుల్లో వీరి హేట్ స్పీచ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తారాస్థాయిలో ‘రప్పా రప్పా’లు జరుగుతున్నాయి. అవి రోడ్డుపైకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందనేది ఊహించడమే కష్టం.
తమ అధినేత నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెచ్చిపోతే.. కటకటాలు లెక్కించే పరిస్థితులు రావచ్చు. రప్పా రప్పా అంటూ ఊర్ల మీద పడితే బలయ్యేది బడా నేతలు కాదు, కార్యకర్తలే. వారిని రక్షించడానికి జగన్ కూడా రారు. రాజకీయాలు ఎప్పుడూ హుందాగా ఉండాలి. ఇలా రప్పా రప్పా అని కూర్చుంటే రాజకీయ నేతలకు రౌడీలకు పెద్దగా తేడా ఉండదు. ఇప్పటికే ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉంది. జగన్ ప్రోత్సాహం వల్ల ఇప్పుడు ఏపీలో ఆయన్ని అభిమానించే యువత అంతా రప్పా రప్పా అంటూ వీధుల్లో తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు వేసి మరీ టీడీపీ నేతలకు వార్నింగులు ఇస్తున్నారు. స్థానిక అధికారులను కూడా బెదిరిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక మీ పనైపోద్ది అని హెచ్చరిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. కళ్లకు కనిపించని ఘోరాలు చాలానే జరుగుతున్నాయి. మరి అవి వైసీపీ నేతలకు కనిపిస్తున్నాయో లేదో. ఇకపోతే.. ‘చంపేస్తాం, నరికేస్తాం’ అనే నినాదాలు చట్టరిత్యా నేరం. కాబట్టి.. ఆ నినాదాలు చేసేవారే కాదు, వాటిని ప్రచురించే ఫ్లెక్సీ సంస్థలు కూడా అడ్డంగా బుక్కవుతాయి. వైఎస్సార్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పుడే ఈ భయానక వాతావరణం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ వారసుడి నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదని, ఇప్పటికైనా ఏపీ ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలని.. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుపుతున్నారు.
Also Read: చంద్రబాబు నిజంగానే జగన్‌ను ఫాలో అవుతున్నారా?
జగన్ పల్నాడు పర్యటనలో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు వైరస్‌లా రాష్ట్రం మొత్తం పాకేసింది. ఇప్పుడు.. వెలుస్తున్న ప్రతి వైసీపీ ఫ్లెక్సీల్లో టీడీపీ నేతలను బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వీరి తీరు టీడీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో కూడా ఇలాంటి ఫ్లెక్సిలు వెలుగుచూశాయి. దీంతో టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. 2029 ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే.. గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్లు రప్పా, రప్పా నరుకుతామనే నినాదాలను ప్రింట్ చేసిన ఫ్లెక్సీ సంస్థపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో ఇలాంటి అరెస్టులు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. మరి ఇప్పటికైనా జగన్.. ఈ హింసాత్మక నినాదాలకు పుల్‌స్టాప్ పెడతారో లేదో చూడాలి. లేకపోతే.. బలిపసువులయ్యేది వారి కార్యకర్తలు.. ఆయన్ని అభిమానించే యువతే.