Jagan VS Pawan: ఏపీలో రాజకీయాలు చాప కింద నీరులా సాగుతున్నాయా? తొలిసారి మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలని జనసేన తహతహలాడుతోందా? కావాల్సిన బలం ఉన్నా ఎందుకు ఆలస్యం చేస్తోంది? జనసేనకు మున్సిపాలిటీ దక్కకుండా వైసీపీ రంగంలోకి దిగేసిందా? అందుకే ఆ మున్సిపాలిటీ విషయంలో డిలే అవుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ప్రతిపక్షం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని భర్తీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. క్రమంగా ఆ పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. జనసేన బలంగా ఉన్న మున్సిపాలిటీలో జెండా ఎగురవేయాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు మున్సిపాలిటీ ఒకటి.
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు
జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేరు. కానీ, రాజకీయంగా పావులు కదిపారు మంత్రి కందుల దుర్గేష్. రేపో మాపో మున్సిపాలిటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి దించాలని ఆలోచన చేస్తున్నారు. జనసేన ప్రయత్నాలు వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్నది ఆ పార్టీ నేతల ఆలోచన. హైకమాండ్ సూచనలతో కొందరు నేతలు రంగంలోకి దిగేసి, మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిడదవోలుని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. మొత్తం 28 కౌన్సిలర్లకు 27 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ కేవలం స్థానంతో సరిపెట్టుకుంది. అంటే అక్కడ జనసేనకు జీరో అన్నమాట. అలాంటి ప్రాంతంలో తెరవెనుక పావులు కదిపారు టూరిజం మంత్రి కందుల దుర్గేష్.
ALSO READ: ఏపీలో ఫుల్ డిమాండ్.. ప్రభుత్వానికి రిక్వెస్టులు, ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణతోపాటు వైసీపీకి చెందిన 9 కౌన్సిలర్లు జనసేన గూటికి వచ్చేశారు. మార్చి 18కి మున్సిపాలిటీ పాలక మండలి ఏర్పడి నాలుగేళ్లు కావడంతో అదే నెల 20న వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు ఛైర్మన్ ఆదినారాయణపై కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అందులో ముగ్గురు మళ్లీ జనసేన గూటికి వచ్చేశారు. దీంతో వైసీపీ బలం 14కు పడిపోయింది.
పావులు కదుపుతున్న వైసీపీ
అక్కడకు జనసేన బలం 13 కాగా, టీడీపీ గెలిచింది ఒక్కస్థానం. ప్రస్తుతం బలాబలాల సంఖ్య వైసీపీ-జనసేన కూటమికి సమానంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. కౌన్సిలర్లతో మంతనాలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఛాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా సింగపూర్ వెళ్లడంతో నిడదవోలు మున్సిపాలిటీలో ఛైర్మన్‌పై అవిశ్వాసం కాస్త ఆలస్యమైంది. ఈ విషయమై రేపో మాపో మంత్రి దుర్గేష్, అధినేతతో మాట్లాడి ఓకే చేయాలని భావిస్తున్నారట. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నిడదవోలు మున్సిపాలిటీలో పరిణామాలు వేగంగా మారిపోవడం ఖాయమని అంటున్నారు.
కందుల దుర్గేశ్ ఏ మాత్రం కష్టపడకుండానే తెర వెనుక సైలెంట్ గా పావులు కదిపారు. ఆయన వేసిన ప్లాన్‌కు వైసీపీ కౌన్సిలర్లు జనసేనలోకి మారిపోవడాన్ని ఆ పట్టణవాసులు ఊహించుకోలేపోతున్నారు. ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ నుంచి స్థానిక సంస్థలు ఒకొక్కటి చేజారుతున్నాయి.తమ పార్టీ ప్రజా ప్రతినిధులను అధికార పార్టీ లాగేసుకుంటోందని అధినేత జగన్ సైతం మీడియా ముందు వాపోయారు కూడా.