రివ్యూ : పెరుసు మూవీ
నటీనటులు : వైభవ్, సునీల్ రెడ్డి, నీహారిక, దీప శంకర్, చాందిని, రెడిన్ కింగ్స్లీ తదితరులు
డైరెక్టర్ : ఇళంగో రామ్
సంగీతం : అరుణ్ రాజ్
బ్యానర్ : స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
Perusu Movie Review : వైభవ్, సునీల్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించిన తమిళ కామెడీ డ్రామా ‘పెరుసు’. ఇళంగో రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చ్ 14 థియేటర్లలోకి వచ్చింది. ఏప్రిల్ 11 నుంచి ‘పెరుసు’ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది ? అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ
పరంధామయ్య అనే ఓ పెద్దాయన ఊర్లో తన భార్యా, కొడుకులు, కోడళ్ళతో కలిసి నివసిస్తాడు. ఆయనకి స్వామి, దొరబాబు అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. స్వామికి రాణితో, దొరబాబుకు శాంతితో పెళ్లి అవుతుంది. ఇక ఉమ్మడి కుటుంబమే అయినప్పటికీ ఎవరికివారే అన్నట్టుగా ఉంటుంది ఈ ఫ్యామిలీ. పరంధామయ్య తన వయసు స్నేహితులతో కలిసి ఎక్కువగా కాలక్షేపం చేస్తాడు. ఓ రోజు స్నానం చేస్తున్న అమ్మాయిల్ని చూస్తున్నాడు అనే కారణంతో ఓ టీనేజ్ అబ్బాయి చెంప పగలగొడతాడు. దీంతో ఆ అబ్బాయి పేరెంట్స్ పరంధామయ్య పెద్ద కొడుకు స్వామికి ఫోన్ చేసి చెప్తాడు. దీంతో పెద్ద కొడుకు ఇంటికి రాగానే తండ్రిని ఈ విషయమై అడుగుదామని వెళ్తాడు. కానీ టీవీ ముందు కూర్చున్న ఆయన చనిపోయినట్టు తెలుసుకుంటాడు. ఆయన చనిపోయిన తీరు చూసి కొడుకు ఆశ్చర్యపోతాడు. తన తమ్ముడు దొరబాబుకి కబురు పెడతాడు. ఇద్దరూ కలిసి తండ్రి శవాన్ని చూసి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటారు.
తండ్రి పెన్ స్ట్రెయిట్ గా నిలబడి, పెద్దదిగా కన్పిస్తుండడంతో బంధువులకు ఈ విషయమై కబురు పెడితే పరువు పోతుందని టెన్షన్ పడతారు పరంధామయ్య కుటుంబ సభ్యులు. మరోవైపు తనను కొట్టిన ఆ పరంధామయ్య పంచెను ఊరి ఆడోళ్ళ ముందు లాగేస్తానని పంతం పట్టుకుని కూర్చుంటాడు ఆ టీనేజ్ కుర్రాడు. ఇక పక్కింటి ఆంటీ వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంది. మరి చివరికి ఆ శవానికి అంత్యక్రియలు ఎలా జరిపించారు? ఈ సమస్య నుంచి కుటుంబ సభ్యులు ఎలా బయటపడ్డారు? అన్నట్టుగానే ఆ టీనేజ్ అబ్బాయి పరంధామయ్య పంచెను ఊడదీశాడా? అనే విషయాన్ని తెరపై చూడాల్సిందే.
విశేషణ
స్టోరీ మొత్తం ఉమ్మడి కుటుంబం, పెద్దాయన మరణం, ఆయన శవం చుట్టూనే కథను అల్లుకుని, వినోదాత్మకంగా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. సున్నితమైన అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని శ్రీలంక మూవీ ‘టెంటిగో’ ఆధారంగా రూపొందించారు. విషయం కత్తి మీద సామే అయినప్పటికీ తనదైన శైలిలో టేకింగ్ తో దర్శకుడు ప్రేక్షకుడిని బాగా ఎంగేజ్ చేశారు. శవం ఉన్న ఇంట్లో కామెడీ ఏంటి ? అనే అనే ఫీలింగ్ లేకపోతే కడుపుబ్బా నవ్వడం గ్యారెంటీ. సినిమాలో అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేనప్పటికీ ఫ్యామిలీ అంతా కలిసి చూడడం కష్టం.
‘పెరుసు’ అంటే పెద్ద అని అర్థం. అలా తండ్రి శవం తో వచ్చిన సమస్యని అన్నదమ్ములు ఇద్దరూ ఓవైపు స్వామీజీ, మరోవైపు డాక్టర్ ద్వారా సాల్వ్ చేద్దామని ప్రయత్నం చేయడం, బాబాయ్ కి విషయం తెలిసినా బయట పడకుండా మేనేజ్ చేయడం కామెడీని పండిస్తుంది. మరోవైపు పరంధామయ్యను కొట్టిన కుర్రాడి పగ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగగా, క్లైమాక్స్ తో మాత్రం ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇక నిజ జీవితంలో బ్రదర్స్ అయిన వైభవ్, సునీల్ రెడ్డి ఇందులోనూ అన్నదమ్ములుగా నటించి ఆకట్టుకున్నారు. పెద్దోడు బాధ్యతగా ఉంటే, చిన్నోడు తాగుబోతుగా కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకులు కావడం విశేషం. ఇక వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు బాగానే నటించారు.
మొత్తానికి…
ముసలోడే కానీ మహానుభావుడు… కడుపుబ్బా నవ్వించే అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ మూవీ అసలు పాయింటే అతి పెద్ద ఇబ్బంది.
Perusu Movie Rating : 2.25/5