Janasena Nagababu : గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ వ్యాప్తంగా 23 వేల ఎకరాలు దోచుకున్నారంటూ జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అటవీ సంపదను దోచుకునేందుకు రహదార్లు వేసి మరీ ఎర్రచందనాన్ని దోచుకున్నారంటూ ఆగ్రహించారు. వైసీపీ నాయకుల అక్రమాలు, గత ప్రభుత్వంలోని కబ్జాలతో సహా కూటమి పార్టీల సమష్టి అభివృద్ధిపై నాగబాబు అనేక విషయాలు మాట్లాడారు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో “జనంలోకి జనసేన” బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. పుంగనూరులో వైసీపీ కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అక్రమాలపై నాగబాబు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రజలకు సేవ చేయమని అధికారం అప్పగిస్తే.. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించిన నాగబాబు.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హయాంలో అటవీ సంపద భారీ దోపిడికి గురైందన్నారు. పెద్దిరెడ్డి భయపెడితే భయపడే వాళ్లం కాదని, దౌర్జన్యాలకు, దాడులకు తాము వెనుకడుగు వెయ్యమని ప్రకటించారు. నీ నేత జగన్ రెడ్డి, ఆయన అయ్య రాజశేఖర రెడ్డికే భయపడే నేత కాదు మా పవన్ కళ్యాణ్ అంటూ ప్రసంగించారు.
మీ అక్రమాలుక అదుపు లేదు
పెద్దిరెడ్డి ఒక్కడే రాయలసీమ వ్యాప్తంగా 23 వేల ఏకరాలు కబ్జా చేశారని విమర్శించారు. వాటి రికార్డులు బయటపడతాయనే భయంతోనే మదనపల్లిలో పైల్స్ దగ్ధం చేయించారని, అటవీ శాఖ, మైనింగ్ మంత్రిగా ప్రకృతి సంపద దోచుకున్న అడవి దొంగ పెద్దిరెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణ కోసం ఏకంగా అడవుల్లో రహాదారులు వేశారని, వడమాల పేటలో గుజరాతి వ్యాపారి అస్తులను బలవంతంగా రాయించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగకుండా.. తిరుపతిలో మఠము భూములను ఆక్రమించుకుని, ఇల్లు కట్టుకున్నారన్నారు. అడ్డూఅదుపు లేకుండా పెద్దిరెడ్డి ఎన్నో అక్రమణలు పాల్పడ్డారని విమర్శించారు. వైసీపీ హయంలో లిక్కర్ నాణ్యత సరిగా లేదన్నందుకు ఓ దళితుడిని హత్య చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అన్నీ చేసి..ఆ అక్రమాలు ఇప్పుడు బయటపెడుతుంటే కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటున్నారని, అదేలా కక్షసాధింపు అవుతుందని ప్రశ్నించారు.
మీ మెడపై కత్తి వేలాడుతోంది..
వైసీపీ నాయకులు ఇంకా కలల్లోనే ఉంటున్నారన్న జనసేనా ప్రధాన కార్యదర్శి నాగబాబు.. 2029లో అధికారములోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకుంటానని పెద్దిరెడ్డి చెబుతున్నారని వెల్లడించారు. వాళ్లు ఇంకా అధికారంలోకి వస్తారనే అశ పడుతున్నారని ఎద్దేవ చేసిన నాగబాబు.. వారి అక్రమాలపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికల ప్రచార సభలోనే పెద్దిరెడ్డి అరాచకాలపై వేటు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేసిన నాగబాబు.. పెద్దిరెడ్డి మెడ మీద సన్నని దారంతో కత్తి వేలాడుతోందని అన్నారు. ఆ దారం త్వరలోనే తెగుతుందని, ఆయన అక్రమాలకు, అరాచకాలకు చెక్ పడుతుందని అన్నారు.
మరో 15 ఏళ్లు మేమే.. మీకు శిక్ష తప్పదు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకంతో రాష్ట్రం ముందుకెళ్తుందన్న నాగబాబు.. రాబోయే 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేస్తాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఊరూ, వాడా, కాలనీల్లో కూటమి జెండా కట్టాలని, వైసీపీ గూండాలకి, సన్నాసులకు భయపడాల్సిన పని లేదన్నారు.
ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా వైసీపీ నేతలు కాలక్షేపం చేస్తున్నారని జనసేనా ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు పదవులెందుకు, జగన్ రెడ్డితో సహా 11 మంది రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పెద్దిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి అందరిపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు.
అధికారం ప్రజలు ఇచ్చింది కక్ష సాధింపుకు కాదు, ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని తెలిపారు. తప్పులు నిరూపించి ప్రతి ఒక్కడిని మెడపట్టి బొక్కలో తోస్తామన్నారు. పంచాయితీరాజ్, అటవీ శాఖలు అప్పుడు పెద్దిరెడ్డి చేశారని, ఇప్పుడు అవే శాఖలు పవన్ కళ్యాణ్ చూస్తున్నారని.. వారిద్దరి మధ్య తేడా ఏంటో గమనించాలన్నారు.