Janasena on YCP: వైసీపీ పాకిస్థాన్ క్రికెట్ టీమ్, కూటమి ప్రభుత్వం టీమిండియా అంటూ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీను, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయని చెప్పవచ్చు. ప్రధానంగా జనసేన వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు జోరందుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ నుండి ప్రారంభమైన ఈ వివాదం, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ తో జనసేన నేతలు మరింత సీరియస్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ బొలిశెట్టి శ్రీను, ఎమ్మెల్యే ధర్మరాజులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై రుసరుసలాడారు.
వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు 151 సీట్లు ఇస్తే పాలన చేతకాక ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేసిన జగన్ అండ్ కో నాడు చేసిన తప్పులకు నేడు కర్మ అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రజల తీర్పుని గౌరవించకుండా మతిభ్రమించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే మీరు చేయాల్సింది వర్క్ ఫ్రం బెంగళూరు కాదు.. మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మీరెంతో మేమూ అంతే అంటూ తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మెజారిటీ ఎలా కావాలో.. ప్రతిపక్ష నేత అవ్వాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నారు. వైసీపీ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లాంటిదని, కూటమి ప్రభుత్వం టీమిండియా లాంటిదన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే దుబాయ్ లో ఇండియా టీమ్ పాకిస్థాన్ కి చేసిన సినిమానే చేసి చూపుతామన్నారు. వైసీపీ చేతకాని పాలన వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని, మిమ్మల్ని గెలిపించిన ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ నిధులు కొట్టేసి వారికి మొండి చెయ్యి చూపిన చేతకాని మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ వారు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి అవినీతికి అంతమే లేదని, 2004లో ఆస్తి ఎంత.. 2019 తర్వాత ఆస్తి ఎంత? మీ ప్రభుత్వంలో సలహాదారుల పేరిట రూ. 680 కోట్ల దుర్వినియోగం నిజం కాదా? కుటుంబ విలాసాల కోసం రూ. 550 కోట్లతో ప్యాలెస్ కట్టించిన మాట వాస్తవం కాదా? అంటూ వారు ప్రశ్నించారు.
తమ అధినేత పుట్టుకతోనే ఎంపీ అని అంబటి రాంబాబు చెబుతున్నాడని, జగన్ తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే ఎంపీ కాదు కదా కౌన్సిలర్ కూడా అయ్యేవాడు కాదన్నారు. అంబటి రాంబాబు అనే ఎరను పెట్టి ఏదో ఒకటి మాట్లాడించి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజం అయిపోతుందా? పవన్ కళ్యాణ్ ఓడినా గత పదేళ్లుగా ప్రజల్లోనే ఉండి సమస్యల మీద పోరాటం చేశారు. సోషల్ మీడియా అరెస్టులు, జైలు సంస్కృతిలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని అన్యాయంగా అరెస్టు చేసి 51 రోజులు జైల్లో ఉంచితే ఇప్పటికీ ఆ కేసు రుజువు కాలేదని తెలిపారు.
Also Read: Womens Railway Stations: తెలుగు రాష్ట్రాలలో మహిళలు నడుపుతున్న.. ఈ రైల్వేస్టేషన్స్ గురించి తెలుసా?
మంత్రి నాదెండ్ల మనోహర్ తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ అని, ఆయన గురించి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. అసలు బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారని, ఒక ద్వారంపూడి, ఒక రంగనాథరాజు, ఒక పేర్ని నాని అంతా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్ మాఫియాగా తయారయ్యారని ఆరోపించారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోయాక.. పార్టీ ఇంఛార్జ్ పదవి కూడా పీకేశాక అంబటి రాంబాబు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతారన్నారు. దమ్ముంటే వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా వైసీపీ అవినీతి, అక్రమాలే బయటకు వస్తున్నాయన్నారు. మరి వీరి కామెంట్స్ పై వైసీపీ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.