Womens Railway Stations: ఆ రైల్వే స్టేషన్ల వద్దకు వెళ్లారో.. అందరూ మహిళలే కంటపడతారు. అంతేకాదు టికెట్ కలెక్టర్ నుండి ప్రతి ఉద్యోగి ఇక్కడ మహిళలే కావడం విశేషం. మహిళలలో అభద్రతా భావాన్ని తొలగించేందుకు రైల్వే చేపట్టిన వినూత్న కార్యక్రమంగా చెప్పవచ్చు. ఏపీలో చంద్రగిరి, తెలంగాణలో బేగంపేట రైల్వేస్టేషన్స్ నేటికీ కేవలం మహిళా ఉద్యోగులతో నడపబడుతున్నవి. మహిళా శక్తిని చాటిచెబుతున్న ఆ రైల్వే స్టేషన్స్ పై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా స్పెషల్ స్టోరీ..
స్త్రీ లేని లోకాన్ని ఊహించడం కష్టమే. మహిళలు మహారాణులు అంటుంటారు. ఔను.. ఏ క్షణాన మహిళలు మాహారాణులు అన్నారో కానీ ఆ మాటను సార్ధకత సాగిస్తున్నారు మహిళలు. స్త్రీని దేవతలా పూజించే సంప్రదాయం మనది. పూర్వం సతీసహగమనం పేరుతో, బాల్యవివాహల పేరుతో ఎన్ని ఇబ్బందులు తలపెట్టినా, ఎందరో మహనీయుల శ్రమతో మహిళలకు అన్నింటా సమాన భాగం లభిస్తోంది. ఒక కుటుంబం ఆనందంగా జీవిస్తోందని అంటే, అందుకు కారణం ఆ కుటుంబంలోని మహిళలే. మహిళా శక్తి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంత చెప్పినా తరగదు.
తల్లి స్థానంలో స్త్రీ పొందే గౌరవం అంతా ఇంతా కాదు. అందుకే తల్లిని మించిన దైవం లేదని మహనీయులు చెప్పకనే చెప్పారు. అయితే గడప దాటని స్థాయి నుండి నేడు అన్ని రంగాలలో రాణించే స్థాయికి మహిళలు చేరుకోవడం వెనుక వారి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు. రాణించడమే కాదు పురుషుల కంటే తామేమి తక్కువ కాదని నిరూపించుకుంటూ సమాజంలో అమిత ఆదరణ పొందుతున్నారు. అందుకే మహిళలను గౌరవించాల్సిన భాద్యత అందరిపై ఉంది. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయంతో మహిళా శక్తిని చాటింది. అలా ఇండియన్ రైల్వే ఏపీలో చంద్రగిరి రైల్వే స్టేషన్, తెలంగాణలో బేగంపేట రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది.
ఈ రెండు రైల్వే స్టేషన్లలో అందరూ మహిళా ఉద్యోగులే ఉండడం విశేషం. స్టేషన్ సూపరిడెంట్ నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఇక్కడ మహిళలే. మహిళా రైల్వేస్టేషన్లుగా చంద్రగిరి, బేగంపేట రైల్వేస్టేషన్లను 2018లో దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. మహిళలలో ఇంకా అక్కడక్కడ ఉన్న అభద్రతాభావాన్ని తొలగించేందుకు మహిళా రైల్వేస్టేషన్లుగా వీటిని ఇండియన్ రైల్వే గుర్తించింది. ఇక్కడ మొత్తం 14 విభాగాలలో మహిళలే అత్యుత్తమ విధులలో ఉంటూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రయాణికులకు ఏ అసౌకర్యం కలగకుండా, నిరంతరం వారు తమ విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ ఇండియన్ రైల్వే ప్రశంసలు అందుకుంటున్నారు.
Also Read: Tiny Island: ఆ అందమైన ఐలాండ్‌లో సిటిజన్‌షిప్ కావాలా? జస్ట్ రూ. 91 లక్షలు చెల్లిస్తే చాలట!
దక్షిణ మధ్య రైల్వేలోని గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ డివిజన్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్, హైదరాబాద్ డివిజన్‌లోని విద్యానగర్ రైల్వే స్టేషన్, విజయవాడ డివిజన్‌లోని రామవరపాడు రైల్వే స్టేషన్, గుంటూరు డివిజన్‌లోని న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లు కూడా ఇదే రీతిలో కేవలం మహిళా ఉద్యోగులచే విశిష్ట సేవలు అందిస్తున్నాయి. కేవలం మహిళలతో నడపబడుతున్న రైల్వేస్టేషన్లుగా ఈ రైల్వే స్టేషన్స్ ప్రత్యేక గుర్తించబడ్డాయి. మహిళా శక్తిని చాటి చెప్పేందుకు, మహిళలకు స్పూర్తిని అందించేందుకు ఇండియన్ రైల్వే తీసుకున్న బృహత్తర నిర్ణయాన్ని మహిళా లోకం అభినందనలతో ముంచెత్తింది. అలాగే అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులను మహిళా సంఘాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. ఎంతైనా మహిళలు రాణించని రంగం నేటి రోజుల్లో లేదని చెప్పవచ్చు. పురుషులతో సమానంగా ఎందరో మహిళలు రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి మహిళల దినోత్సవం రోజున.. మనమందరం శుభాకాంక్షలు తెలుపుదాం!