JanaSena: ఎమ్మెల్సీ నాగబాబు. సైలెంట్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. తమ్ముడికి అండగా నిలిచారు. తెర వెనుక కష్టపడ్డారు. జనసైన్యాన్ని నడిపించారు. ఇన్నాళ్లూ పార్టీకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పొలిటికల్ స్క్రీన్ మీద మెగా రోల్‌కు రెడీ అయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం.. జన సైనికులకు డబుల్ ధమాకా.
నాగబాబును ఎమ్మెల్సీని చేసిందే మంత్రి పదవి ఇవ్వడానికి అని అంటున్నారు. ఆయనకు ఇచ్చే కేబినెట్ బెర్త్ ఇదే అంటూ రకరకాల ప్రచారమూ జరుగుతోంది. అదిగో ఉగాదికే కేబినెట్ విస్తరణ.. లేదులేదు జూన్లో తొలకరి తర్వాత అంటూ మరో వాదన. ఇలా రకరకాల డేట్స్ వినిపిస్తున్నాయి. అన్నయ్య తనకు మొదటినుంచి బలమైన అండాదండాగా ఉన్నారని.. ఆయనకు సముచిత న్యాయం చేయడం ధర్మమని పవన్ కల్యాణ్ బహిరంగంగానే చెప్పారు. అందుకే, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పోస్ట్ కూడా పక్కా అంటున్నారు.
ఇక్కడే కాస్త ట్విస్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. నాగబాబుకు కాస్త నోరు ఎక్కువ. దురుసుతనమూ ఎక్కువే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం. పోస్టులతో ప్రత్యర్థులను గిల్లడంలో ఎక్స్‌పర్ట్. లౌక్యం కంటే ముక్కుసూటితనం మెండు. ఇలా నవరసభరితంగా ఉండే నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలా ఉండబోతున్నారనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవేళ మంత్రి కూడా అయితే.. అప్పుడుంటుంది అసలు మజా!
Also Read : నేమ్ గేమ్.. జగన్‌కు రిటర్న్ గిఫ్ట్.. స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా!
నాగబాబుకు ఉన్న ఈ ప్రత్యేక నేచరే ఆయనకు ప్లస్ అండ్ మైనస్. ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో నాగబాబు మాట్లాడిన తీరుపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. పవన్ గెలుపునకు రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కారణమంటూ.. మిగతా లీడర్ల స్థాయి తగ్గించినట్టు మాట్లాడారనే విమర్శ వచ్చింది. మెయిన్‌గా వర్మ టార్గెట్‌గానే నాగబాబు అలా అన్నారని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి ఉందట. పిఠాపురంలో జనసేనాని గెలుపులో టీడీపీ, వర్మ పాత్రను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని? నాగబాబు అలా మాట్లాడటం తగదనే చర్చ నడిచింది. ఎమ్మెల్సీ కాగానే ఆయన ఇలా అంటే.. ఇక మంత్రి అయితే.. నాగబాబు జోరు ఇంకెలా ఉంటుందోననే ఆలోచనలో టీడీపీ ఉందని తెలుస్తోంది. ఆ పాయింట్ బేస్ చేసుకుని.. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీ కూడా చేస్తోంది. ఈ ప్రచారం రెండు పార్టీలకూ కాస్త ఇబ్బందిగా మారింది.
పవన్ కల్యాణ్ అంత కాకున్నా.. నాగబాబు కూడా ఫైర్ బ్రాండ్. మెగా బ్రదర్ కూడా ఇకముందు ఫుల్ యాక్టివ్ అయితే.. ఇక జనసేన దూకుడుకు పగ్గాలుండకపోవచ్చు. పార్టీలో, పబ్లిక్ లో మరింత జోష్ రావొచ్చు. వైసీపీకి ఇకముందు దబిడిదిబిడే.