Indian Railways: దేశానికి తలమానికం అయిన జమ్మూకాశ్మీర్ లో రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా కొత్త రైల్వే లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. రైల్వే నెట్ వర్క్ లో చారిత్రాత్మక మౌలిక సదుపాయాల విస్తరణ కొనసాగుతోంది. అందులో భాగంగానే జమ్మూ-శ్రీనగర్ రైల్వే లింక్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ మార్గంలో రైల్వే సర్వీసులు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ రైల్వే మార్గంలో నిర్మించిన అంజి ఖాడ్ కేబుల్ వంతెన, చీనాబ్ రైల్వే వంతెన భారతీయ ఇంజినీరింగ్ శక్తికి నిదర్శనంగా నిలిచాయన్నారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ బ్రిడ్జి నదీ గర్భం నుంచి ఈఫిట్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉందన్నారు.
త్వరలో జమ్మూ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైలు సర్వీసు
ఇప్పటికే జమ్మూ- శ్రీనగర్ మధ్య CRS తనిఖీలు పూర్తయినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే జమ్మూ- శ్రీనగర్ మధ్య రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే CRS నివేదికలో ఇచ్చిన సూచనలు అమలు చేయబడుతున్నట్లు తెలిపారు. అన్ని సూచనలు అమలు చేసిన తర్వాత జమ్మూ- శ్రీనగర్ మధ్య రైలు కార్యకలాపాలకు ఆమోద ముద్ర పడుతుందన్నారు. ఈ రైల్వే లైన్ ను ప్రారంభించడం ద్వారా ఓ ప్రధాన జాతీయ కలను నెరవేరబోతోందన్నారు.
జమ్మూకాశ్మీర్ లో పలు రైల్వే సర్వేలు
అటు జమ్మూకాశ్మీర్ లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో 5 కొత్త రైల్వే సర్వేలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక, సాధ్యాసాధ్యాల సమస్యల కారణంగా పలు కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని వెల్లడించారు. అధిక ఖర్చులు, తక్కువ ట్రాఫిక్ డిమాండ్ కారణంగా శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు ప్రాజెక్టును రద్దు చేసినట్లు వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. జమ్మూ-పూంఛ్ రైల్వే లైన్ సాధ్యాసాధ్యాల సవాళ్ల కారణంగా నిలిచిపోయిందన్నారు. బనిహాల్-బారాముల్లా రైలు మార్గాన్ని అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Read Also: ఆకట్టుకునే జలపాతాలు, ఆహా అనిపించే మంచుకొండలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయాల్సిందే!
వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, కాశ్మీర్ లోని గండేర్ బాల్- లడఖ్ లోని కార్గిల్ మధ్య రైలు లింక్ కోసం సర్వే నిర్వహించే తక్షణ ప్రణాళికలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల ఆమోదం అనేది నిర్దిష్ట జిల్లా లేదా కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ట్రాఫిక్ డిమాండ్, కార్యాచరణ అవసరాలు, నిధుల లభ్యత ఆధారంగానే జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు.శ్రీనగర్- కార్గిల్- లేహ్ రైలు మార్గం కోసం 2016-17లో ఓ సర్వే జరిగిందన్నారు. 480 కి.మీ. ప్రాజెక్టు ఖర్చు రూ. 55,896 కోట్లుగా అంచనా వేయబడిందన్నారు. అయితే, తక్కువ ట్రాఫిక్ అంచనా కారణంగా దీనిని ముందుకు కొనసాగించలేదని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: రైల్వే టికెట్లపై కేంద్ర సబ్సిడీ, వామ్మో అంత శాతం ఇస్తుందా?