Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్.. ఈ పేరు ఏపీలో మార్మోగుతోంది. ప్రధానంగా వైసీపీ నేతల కంటే జనసేన నేతల నుండే ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే దువ్వాడ అరెస్ట్ ఎప్పుడంటే ఇప్పుడే అంటూ ప్రచారం కూడా సాగుతోంది. ఇంతలా దువ్వాడ పేరు వాడవాడనా వినిపించడానికి గల కారణం.. అదే వాడవాడల్లో ఫిర్యాదులు.. కేసులు నమోదవడమేనట. గత రెండు రోజులుగా అదిగో అరెస్ట్.. ఇదిగో జైలు అంటూ సోషల్ మీడియాలో దువ్వాడపై ప్రచారం సాగుతోంది. ఇలా ప్రచారం జరగడం వెనుక పెద్ద కథే ఉందట. మొత్తం మీద జనసేన నేతలు మాత్రం ఒక పట్టాన దువ్వాడను వదిలేలా లేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల శాసనమండలి సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద పొలిటికల్ బాంబ్ విసిరారు. అక్కడ మీడియా ప్రతినిధులతో దువ్వాడ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నెలకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రశ్నించకుండా ఉండేందుకు కూటమి నుండి ఇలా నగదు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అంతతేకాకుండా పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేశారని చెప్పవచ్చు. అయితే దువ్వాడ తొలి శాసనమండలి సమావేశాల రోజు మాట్లాడిన మాటలు, చిన్నగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ కామెంట్స్ పై జనసేన నేతలు భగ్గుమన్నారు.
ఎలాగైనా దువ్వాడపై కేసు నమోదు చేయాలని జనసేన నేతలు పట్టుబట్టారు. ఆ జిల్లా ఈ జిల్లా కాకుండా ప్రతి జిల్లాలో దువ్వాడపై ఫిర్యాదుల పరంపర సాగుతోంది. అంతేకాదు మాజీ సీఎం జగన్ ప్రోత్సాహిస్తున్నారని ఆరోపిస్తూ జగన్ పై కూడా ఫిర్యాదులు సాగిస్తున్నారు. ఈ ఫిర్యాదుల పరంపర ఇప్పటికీ గత రెండు రోజులుగా సాగుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జగన్ పై, దువ్వాడపై మాజీ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. మొత్తం మీద కేసులు నమోదవుతున్నాయో లేదో కానీ దువ్వాడను జనసేన టార్గెట్ చేసిందని చెప్పవచ్చు.
ఇప్పటికే సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి రోజుకొక జైలుకు తిరుగుతున్నారు. ఆయనపై ఇప్పటికే 14 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కర్నూల్ జైలులో ఉన్నారు. అయితే పోసానికి పట్టిన గతి దువ్వాడకు తప్పదని, ఆరోపణలు చేసే సమయంలో కాస్త జాగ్రత్త పాటించాలని జనసేన లీడర్స్ అంటున్నారు. ఏకంగా పవన్ నెలకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని నొక్కి వక్కాణించి దువ్వాడ పలకడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అందుకే జనసేన నేతలు ఏమాత్రం తగ్గకుండా దువ్వాడపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు.
Also Read: BigTV Exclusive: లేడీ అఘోరీకి ఫారిన్ ఫండ్స్? అఘోరీ కాదు శీను.. Big TVతో అనిల్ బెహరా
అందుకే దువ్వాడ పేరు వైసీపీ నేతల నోటి కంటే, జనసేన నేతల నోటి వెంట వినిపిస్తోంది. అసంబద్ద విమర్శలు, ఆరోపణలు గుప్పించిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈరోజూ రేపు అరెస్ట్ ఖాయమని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. ఇన్ని ఫిర్యాదులు తనపై ఇస్తున్నా, ఇప్పటి వరకు దువ్వాడ కామెంట్స్ చేయకపోవడం విశేషం. అలాగే దువ్వాడ సన్నిహితురాలు దివ్వెల మాధురి కూడా ఈ అంశంపై స్పందించని పరిస్థితి. మొత్తం మీద దువ్వాడపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.