కూటమి ప్రభుత్వ హయాంలో జనసైనికులు అవమానాలు ఎదుర్కొంటున్నారా..?
పార్టీకోసం పనిచేస్తున్న నిఖార్సయిన కార్యకర్తల్ని జనసేన పట్టించుకోవడంలేదా..?
అధినేత సైలెంట్ గా ఉండటాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసైనికుల ట్వీట్లు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. తాజాగా సాయిబాబా అనే జనసైనికుడి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ లేఖ వైరల్ గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి సాయిబాబా లేఖ రాశారు. తనలాగే పార్టీలో చాలామంది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని సాయిబాబా వివరించారు. మరి ట్విట్టర్లో జనసైనికుడి ఆవేదన జనసేనాని వరకు చేరుతుందో లేదో చూడాలి.
అన్న @PawanKalyan ఎంతో బాధ తో జనసేన పార్టీ పట్ల ప్రేమ తో నా చివరి ప్రయత్నం గా నేను చెప్పాలి అనుకున్నది ఈ లెటర్ లో రాసాను అది మీరు చదివి తగు చెర్యలు చెపడతారు అని ఆశిస్తున్నాను 🙏🏻.
బరువెక్కిన గుండెలతో పార్టీ కి మరియు ఈ ట్విట్టర్ కి స్వస్తి 🙏🏻
ఎవర్ని అయినా నా ఈ ప్రయాణం లో బాధించి… pic.twitter.com/K0Zi7zL8AM
— Sai Baba (@baba369) March 25, 2025
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పుకోవాలి. కానీ క్షేత్ర స్థాయిలో కూటమి అంటే టీడీపీ ప్రభుత్వం మాత్రమే అనే అర్థం ఉందని ముఖ్యంగా జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన అధికార పార్టీనా, ప్రతిపక్షమా అనేది అర్థం కావడంలేదని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించామని, ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జనసైనికుల తలరాత మారలేదని వారు ఆరోపిస్తున్నారు.
జనసేన ఎదగాలని ఉందా..?
అసలు జనసేన ఎదుగుదలను పవన్ కల్యాణ్ పట్టించుకుంటున్నారో లేదో అనే అనుమానం వస్తోందని తన లేఖలో ప్రస్తావించారు సాయిబాబా అనే జనసైనికుడు. ఇటీవల తిరువూరు నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ ను వివరణ కోరుతూ జనసేన ఒక బహిరంగ నోటీసు ఇచ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణహాని ఉందని మీడియాతో చెప్పినందుకు వివరణ కోరింది. అలాంటి వ్యవహారం ఏదైనా ఉంటే ముందు పార్టీ దృష్టికి తీసుకురావాలి కానీ, మీడియాకెక్కడం మంచిది కాదని సూచించారు నేతలు. అదే సమయంలో 48 గంటల్లోగా ఎక్స్ ప్లెనేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను కూడా సాయిబాబా పరోక్షంగా తన లేఖలో ప్రస్తావించారు. అసలు జరిగిందేంటో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే.. సదరు తిరువూరు ఇన్ చార్జ్ ని పిలిపించి మాట్లాడేవారని, కానీ బహిరంగంగా నోటీసులివ్వడం ద్వారా ఆయన్ని చులకన చేశారని అన్నారు.
అరెస్ట్ లు ఆగలేదు..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా జనసేన కార్యకర్తల అరెస్ట్ లు ఆగలేదని, అయినా కూడా పార్టీ పట్టించుకోవడంలేదని అంటున్నారు సాయిబాబా. ప్రభుత్వం కేసులు పెట్టినా తమకు పెద్దగా బాధలేదని, అయితే పార్టీ ఆఫీస్ పట్టించుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. వైసీపీ వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా జనసేన పార్టీ అధికారికంగా ఖండించడం లేదని ఆయన వాపోయారు. అదే సమయంలో కొంతమంది టీడీపీ వాళ్లు కూడా వైసీపీ వారితో చేరి పవన్ కల్యాణ్ పై లేనిపోని ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. తాను జనసేనకు, ట్విట్టర్ కి కూడా గుడ్ బై చెప్పేస్తున్నాని అన్నారు సాయిబాబా.
కార్యకర్తల్ని పట్టించుకోండి..
పార్టీని కార్యకర్తలు పట్టించుకున్నంతగా, పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా. పార్టీ బాగుంటే సరిపోదని, పార్టీలోని కార్యకర్తలు కూడా బాగుండాలని ఆయన సూచించారు. ఇన్నాళ్లూ పార్టీకోసం సిన్సియర్ గా కష్టపడ్డామని, ఆత్మాభిమానం చంపుకొని ఉండాలంటే తమ వల్ల కావడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారయినా పవన్ కల్యాణ్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మీటింగ్ పెట్టారా అని ప్రశ్నించారు. ఇకనైనా ఆ పని చేయాలని, వారిలోని అసంతృప్తి ఏంటో తెలుసుకోవాలని సూచించారు.
సాయిబాబా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఈ లెటర్ పై సానుకూలంగా స్పందిస్తున్నారు. జనసేనలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందని, అధిష్టానం కాస్త దృష్టిపెట్టాలని వారు సూచిస్తున్నారు.