JC Prabhakar: జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. మీడియా ముందుకు వచ్చారంటే చాలు.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతీ మాట ఒక పొలిటికల్ బుల్లెట్‌లా పేలుతుంది. తాజాగా అనంతపురం రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను తుఫాను రేపాయి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ను లక్ష్యంగా చేసుకుని జేసీ విరుచుకుపడ్డ తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నాతో మాట్లాడితే ఏడుస్తారు!
అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నేను నా భాష వాడితే తట్టుకోలేక ఏడుస్తారు’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనంత ఒక్క మంచి పని కూడా చేయలేదని, చివరకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కూడా చెడగొట్టారని ఆరోపించారు. అనంతపురంలో ఆయనంత అవినీతిపరుడు మరొకరు లేరని, నగరాభివృద్ధి కావాలో లేదో ఆలోచించుకుని మేయర్‌తో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.
వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
గత వైసీపీ ప్రభుత్వంపై జేసీ నిప్పులు చెరిగారు. 2021-22లో కుప్పం మున్సిపాలిటీతో పాటు ఇతర ఎన్నికల్లో తమిళనాడు నుంచి జనాలను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తానైనా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, లాయర్ ద్వారా నామినేషన్ వేయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ నామినేషన్‌కు వచ్చిన తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లిన చరిత్ర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉందని, అలాంటి వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
శైలజానాథ్‌కు మాస్ వార్నింగ్
మాజీ మంత్రి శైలజానాథ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో మళ్లీ ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఆ మండలాల్లో కాలు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. పుట్లూరు అభివృద్ధి కోసం తాను భోగాతి నారాయణ రెడ్డిని కలిసి మాట్లాడుతానని చెప్పారు.
వైసీపీ కథ ముగిసినట్టే..
అనంతపురం కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే మేయర్ అధికారంలో ఉన్న టీడీపీలోకి మారాలని సూచించారు. వైఎస్సార్ జిల్లా, అనంతపురంలో రాబోయే రోజుల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల కుటుంబం మాత్రమే రాజకీయాల్లో నిలుస్తారని, వైసీపీ కథ ముగిసిపోయిందని స్పష్టం చేశారు.
Also Read: గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం