Chanagani Dayakar: తెలంగాణ రాజకీయం సిద్దిపేట వేదికగా మరోసారి వేడెక్కింది. ఈ నెల 19వ తేదీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయ పతనం ప్రారంభం కాబోతోందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను వివరంగా వెల్లడించారు.
సిద్దిపేటలో డిపాజిట్ కూడా దక్కదు!
రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని దయాకర్ అన్నారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని, రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. కేవలం ఫార్మ్‌హౌస్‌లు, సొంత ప్రయోజనాల కోసమే అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు డిపాజిట్ కూడా రాదని, బిఆర్ఎస్ నాయకులు చేసే పిల్లి శాపనార్థాలకు కాంగ్రెస్ భయపడేదే లేదని స్పష్టం చేశారు.
ప్రజా పాలనలోనే నిజమైన అభివృద్ధి
రేవంత్ రెడ్డి గారి పాలనలోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమైందని దయాకర్ కొనియాడారు. ఇండ్లు లేని ఊరు లేనంతగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఈనాడు మహిళలు స్వశక్తితో పోటీపడి వ్యాపారాలు చేసే స్థాయికి ఎదిగారని ఆనందం వ్యక్తం చేశారు.
మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి..
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని, వారి దీవెనలతోనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి సగర్వంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతోనే మున్ముందు తెలంగాణను మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Also Read: 40 ఏళ్ల రాజకీయంలో ఒక్క మంచి పని చేశావా? అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ఆగ్రహం