PSR Anjaneyulu: PSR రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. విజయవాడ CID అధికారి ప్రసాద్ రూపొందించిన రిమాండ్ రిపోర్ట్ లో ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకు వచ్చాయి. PSR ఆంజనేయులుకు చట్టం పట్ల గౌరవం లేదని CID తెలిపింది. నటి జత్వానీ ఓ బాధ్యతాయుతమైన భారత పౌరురాలని ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని కూడా CID వెల్లడించింది. కుక్కల విద్యాసాగర్ ఈ కేసులో A1 గా ఉన్నారని తెలిపింది. ముంబై, హైదరాబాద్ లలో జత్వానీ మోడలింగ్ చేసేవారని.. ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పరిచయమయ్యారని సీఐడీ తెలిపింది. పెళ్లి చేసుకుంటానని జత్వానీకి కుక్కల విద్యాసాగర్ ప్రతిపాదించారని కూడా సీఐడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
పెళ్లి ప్రతిపాదనను జత్వానీ తిరస్కరించడంతో విద్యాసాగర్ ఆమెపై పగ పెంచుకున్నాడని రిమాండ్ రిపోర్టు తెలిపింది. అక్కడి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడని సీఐడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. జత్వానీ న్యూడ్ ఫోటోలను సేకరించిన విద్యాసాగర్ వాటిని ఆమెకు పంపాడని, అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా సీఐడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వైసీపీ నేత అయిన విద్యాసాగర్ తన పలుకుబడి ఉపయోగించి కేసుల్లో ఇరికించారని సీఐడీ స్పష్టం చేసింది.
కాగా మంగళవారం నాడు ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులును కోర్టులో హాజరుపరిచారిచిన సంగతి తెలిసిందే.. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో నిన్న PSRని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న CID పోలీసులు విజయవాడ తరలించి విచారణ చేపట్టారు. CID కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. CID కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం PSR ఆంజనేయులు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల పూర్తయిన అనంతరం నేరుగా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
కర్నూల్ రైల్వే కోయ ప్రవీణ్ నేతృత్వంలో PSR విచారణ కొనసాగింది. జత్వానీ కేసులో వేధింపులకు కారణాలు ఏమిటంటే ప్రశ్నలు కురిపించారు. జత్వానీ విషయంలో పెద్దలు చెప్పిన సూచన మేరకే అలా అమలు చేయాల్సి వచ్చిందని.. దాంట్లో మా తప్పేమీ లేదని PSR చెప్పినట్లు తెలుస్తోంది. తానుగా ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు PSR సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.
Also Read: గుట్టు విప్పేసిన రాజ్ కసిరెడ్డి.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు, రేపోమాపో నోటీసులు
ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో PSR ఆంజనేయులు ఏ2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఇటీవల జత్వానీ కేసును విచారించిన హైకోర్టు.. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. దాంతో రంగంలో దిగిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో.. నటి జత్వానీపై అక్రమ కేసులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీతో పాటు ఆమె పేరెంట్స్‌ను అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. అక్రమంగా నిర్భందించారన్నది జత్వానీ అభియోగం. తనని నిర్బందించి ఓ వ్యాపారవేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ వేధించారంటూ…గత జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది జత్వానీ. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్‍ల పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో కేసును సీఐడీకి బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.