Big Stories

Kadapa politics: భారతి Vs షర్మిళ.. అందరిచూపు కడపపై.. అంతఃపురం లోగుట్టు..

Kadapa politics: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని అధికార వైసీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళిక లతో రంగంలోకి దిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కడపపై అందరిదృష్టి పడింది. ఈసారి కడపలో ముక్కోణపు పోటీ ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ-విపక్ష టీడీపీ-మరోవైపు కాంగ్రెస్ కూడా అటువైపు ఫోకస్ చేసింది.

- Advertisement -

ఒకసారి కడప జిల్లాను చుట్టేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల, మరోసారి జిల్లా అంతటా ప్రచారం చేయాలని భావిస్తోంది. మే ఒకటి నుంచి ఈ జిల్లాలో మరోసారి ప్రచారం చేయనున్నారు. షర్మిలకు మద్దతుగా బ్రదర్ అనిల్‌కుమార్ చాపకింద నీరులా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకు పై ఆయన ఫోకస్ చేశారు. క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాస్టర్లు, క్రైస్తవులతో భేటీ అవుతున్నారు. వైసీపీపై గుర్రుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నారు.

- Advertisement -

కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలను రంగంలోకి దించాలని ఆలోచన చేస్తోంది ఏపీ కాంగ్రెస్. వైఎస్ షర్మిలకు తోడు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేతలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలను ప్రచారంలోకి దిగబోతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకోవడంతో పనిలోపనిగా రాయలసీమ వైపు కాంగ్రెస్ దృష్టి పెట్టనుంది.

వైఎస్ షర్మిల ప్రచారంలో వైసీపీకి నెగిటివ్ సంకేతాలు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన జగన్.. వైసీపీ కోటలకు బీటలు వారే ప్రమాదముందని భావించారు. వెంటనే తన భార్య భారతిని రంగంలోకి దించారు. ముఖ్యంగా పులివెందులలో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నారు. ఆ తర్వాత జిల్లా అంతటా ఆమెతో ప్రచారం చేయించాలన్నది జగన్ ఆలోచనగా నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య మాటలు తూటాల మాదిరిగా పేలడం ఖాయమని భావిస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ గురించి మరిన్ని విషయాలు తెలియడం ఖాయమని అంటున్నారు.

ALSO READ: ఈనెల 30న కూటమి మేనిఫెస్టో.. మాఫియా డాన్‌లతో పోరాడుతున్నాం..

మొత్తానికి ఎన్నికల వేళ పులివెందుల అంతఃపురం లోగుట్టు బయటకు రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ నేతలు. ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ మధ్య అంతర్గత వార్ నేపథ్యంలో తమకు కలిసివస్తుందని తెలుగుదేశం అంచనాలు వేసుకుంటోంది. అంతేకాదు ఈసారి కడపలో తాము టీడీపీ జెండా ఎగురుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు కూడా. వీలైతే కడపలో నారా భువనేశ్వరితో ఎన్నికల ప్రచారం చేయించే అవకాశముందని ఆ జిల్లా నేతలు చర్చించుకోవడం మొదలైంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News