Kakinada PDS Rice: మీరందరూ సింగం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో సూర్య పోలీస్ అధికారి పాత్రలో, విలన్ డానీని పట్టుకునేందుకు పరుగులు తీస్తాడు. అలాగే సముద్రంలో ఛేజింగ్ చేసి విలన్ ఆట కట్టిస్తారు హీరో సూర్య. అదే తరహాలో ఛేజింగ్ సీన్ ఏపీలోని కాకినాడలో జరిగింది. కానీ ఇక్కడ ఛేజింగ్ చేసింది మాత్రం ఐపీఎస్ కాదు ఐఏఎస్.
కాకినాడ వద్ద తీర ప్రాంతం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ తీర ప్రాంతం నుండే రేషన్ బియ్యం అక్రమంగా సాగుతుందని రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అది కూడా పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతుందని సమాచారం నేరుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కస్టమ్స్ అధికారులకు తెలిసింది. చిన్నచిన్న ఓడల ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణా సాగుతుందని సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, రెవిన్యూ సివిల్ సప్లై అధికారులతో పాటు స్థానిక పోలీసులను తీసుకుని సముద్రంలోకి అడుగుపెట్టారు.
ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన బియ్యం అక్రమ రవాణా దారులు తమ ఓడల స్పీడ్ పెంచారు. అదే తరహాలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తో పాటు అధికార యంత్రాంగం కూడా అదే స్పీడుతో వాటిని ఛేజింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సీన్ పూర్తిగా సింగం సినిమాను తలపించేలా సాగగా, స్థానిక ప్రజలు సైతం అసలేం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు జిల్లా కలెక్టర్ మోహన్ అనుకున్నది సాధించేశారు.
సముద్రంలో ఛేజింగ్ చేసిన అధికారులు ఎట్టకేలకు భారీ ఓడలో ఐదు కంటైనర్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఒడ్డుకు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అసలు ఈ బియ్యం ఎక్కడినుండి ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయో తెలుసుకునేందుకు, ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ సైతం ప్రారంభించారు.
Also Read: Lady Aghori Case: లేడీ అఘోరీపై కేసు.. జోక్యం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి.. స్పీడ్ పెంచిన పోలీసులు
ఇంత పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా సాగుతుండగా, దీని వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్నది విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమీపంలోనే రేషన్ అక్రమ రవాణా దందాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సారథ్యంలో ఆట కట్టించడంతో అధికారుల తీరుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇంతకు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న రహస్య హస్తం ఎవరిదో తేలాల్సి ఉంది.