Nani Vs Chinni: అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం చూశాం. ఇలాంటి సమస్యలు సహజమేనని కొందరు భావిస్తుంటారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మళ్లీ ఒకటే తాటి మీదకు వస్తారు. పైన కనిపిస్తున్నవారు కజిన్ బ్రదర్స్. ఒకరు ఎంపీ కాగా, మరొకరు మాజీ ఎంపీ. ఒకప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత చెదిరిపోయారు. నిత్యం కోల్డ్‌వార్ జరుగుతూనే ఉంది.. ఉంటుంది కూడా. వారెవరో తెలుసా?
విజయవాడ సిటీలో కేశినేని ఫ్యామిలీ గురించి చెప్పనక్కర్లేదు. గడిచిన పదేళ్లు టీడీపీ ఎంపీగా చెలామణి అయ్యారు. మారిన పరిస్థితుల కారణంగా ఆయన వైసీపీ వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయినా చీటికి మాటికీ కజిన్ బ్రదర్ ఎంపీ చిన్ని మీద ఒంటికాలిపై లేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది అనుకోండి.
కోల్డ్‌వార్‌కి ముగింపు లేదా?
గడిచిన పదేళ్లు కేశినేని నాని ఎంపీగా ఉన్నప్పుడు ఆయన బ్రదర్ చిన్ని సైలెంట్‌గా ఉండేవారు. పార్టీ కార్యక్రమాలు చేస్తూ తన పని తాను చేసుకుపోయేవారు. పెద్దగా మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. అన్నీ తానై వ్యవహరించారు నాని. పదేళ్లు ఎంపీగా ఉండడంతో తనకు ఎదురులేదని భావించారాయన. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని భావించలేదు. చివరకు మారిన రాజకీయాల నేపథ్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కేశినాని నానికి ఇంటిపోరుతోపాటు తమ్ముడు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. మొన్నటి ఎన్నికల్లో తమ్ముడు చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు నాని. అప్పటి నుంచి కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఏమనుకున్నారో తెలీదు గానీ ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు నాని.
ALSO READ: నిన్న ఆంజనేయులు.. నేడు సునీల్‌కుమార్.. రేపు ఇంకెవరో?
కేశినేని నాని ప్రత్యర్థులు, కొందరు టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. ఉన్నట్లుండి నాని ట్వీట్ వెనుక ఏం జరుగుతోంది? పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? తమ్ముడి టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? అంటూ ప్రత్యర్థుల నుంచి రకరకాల కామెంట్లు పడిపోయాయి. అవేమీ ఆయన పట్టించుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటివి సహమేనని భావించారు.
ఇంటి పోరు మొదలు ప్రత్యర్థులుగా
ఇప్పుడు తమ్ముడు ఎంపీ కేశినేని చిన్ని నుంచి అసలైన పోరు నానికి మొదలైంది. ఈ మధ్య విశాఖలో ఓ కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ కంపెనీలో చిన్ని మిత్రుడు డైరెక్టర్‌గా ఉంటున్నాడని అంటున్నారు. ఈ కారణంగానే తక్కువ ధరకు భూములు కట్టారని తమ్మడిపై ఉవ్వెత్తున లేశారు. ఈ విషయం పైకి ఓపెన్‌గా చెప్పలేకపోయినా అన్నదమ్ముల మధ్య సోషల్‌మీడియా వేదికగా కోల్డ్‌వార్ తీవ్రమైంది.
ఒకవిధంగా చెప్పాలంటే అన్నాతమ్ముడు ఆధిపత్యం పోరు కొనసాగుతోంది. ఇరువురు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఈ పోరు అన్నదమ్ముల మధ్య ఎంతకాలం ఉంటుందో చూడాలి. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా వీరిద్దరు ఒక్కటే అవుతారని అంటున్నారు బెజవాడవాసులు.