దేశంలో ఎన్నో విచిత్రమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. జీవన విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. పూజా విధానాలు కూడా ప్రాంతానికి ఓ రీతిగా ఉంటాయి. ఇక దేశంలో కొన్ని ఆలయాలు అత్యంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అక్కడ పాటించే పద్దతు కూడా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలోనూ ఇలాంటి ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వెరైటీగా ఉంటుంది. ఇంతకీ ఈ విచిత్ర నైదేద్యం సమర్పించే ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు ఆ పదార్థాలను నైవేద్యంగా పెడతారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టెంగ్రాలో చైనీస్ కాళి ఆలయం
కోల్ కతాలోని టెంగ్రాలో చైనీస్ కాళి మందిర్ ఉంది. ఈ ప్రాంతాన్ని చైనా టౌన్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 60 ఏండ్ల క్రితం వెలసినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ ఆలయంలో హిందువులతో పాటు చైనీయులు కూడా పూజలు నిర్వహిస్తారు. చాలా కాలం క్రితం, ఒక పెద్ద చెట్టు దగ్గర రెండు రాళ్ళు ఉండేవి. ప్రజలు వాటి మీద సింధూరాన్ని పూసి పూజలు చేసే వారు. అదే సమయంలో ఒక చైనీస్ బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి ఎన్నో రకాల చికిత్సలు అందించినా, నయం కాలేదు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ రాళ్లను కాళి దేవిగా ప్రార్థించారు. తమ కొడుకును కాపాడాలని వేడుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడటంతో, అప్పటి నుంచి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ ఆలయ నిర్మాణం కొనసాగింది. కాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం వేడుకలు జరుగుతాయి. చైనీలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.
నైవేద్యంగా నూడుల్స్, ప్రైడ్ రైస్
ఈ ఆలయంలో అమ్మవారికి సమర్పించే ప్రసాదం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనీస్ కాళీ మాతకు నూడుల్స్, ప్రైడ్ రైస్, మోమోలు ప్రసాదంగా సమర్పిస్తారు. మంచూరియన్ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇక ప్రతి ఆలయంలో సాధారణంగా పూజ సమయంలో దీపం వెలిగించి, హారతి అందిస్తారు. కానీ, ఇక్కడ కొవ్వొత్తులను వెలిగించి పూజ చేస్తారు. ఇక దుష్ట శక్తులు రాకుండా ఉండేందుకు కాగితాలను కాల్చుతారు. ఇక ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు సైతం నూడుల్స్, మోమోస్ ప్రసాదంగా పెడతారు. ఈ నైవేద్యం కారణంగా ఆలయం ప్రత్యేకతను చాటుకుంది.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి, పాక్ ఎంబసీలో కేక్ కటింగ్.. వీడియో వైరల్!
చైనీస్ కాళి ఆలయానికి ఎలా వెళ్లాలంటే?
ఇక మీరు కూడా చైనీస్ కాళి ఆలయానికి వెళ్లాలంటే, కోల్ కతా లోని రవీంద్ర సదన్ స్టేషన్ వెళ్లాలి. సబ్ వే ద్వారా టాప్సియా లేదంటే సైన్స్ సిటీకి వెళ్లే బస్సులో అక్కడికి చేరుకోవచ్చు. ఈ ఆలయం వారంలో ఏడు రోజులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటుంది.
Read Also: రొయ్యలకు బాగా మద్యం తాగించి.. మలమల మరిగే నూనెలో వేసి.. ఇది ఎక్కడ దొరుకుతుందంటే?