RP : కిరాక్ ఆర్పీ. కమెడియన్ నుంచి పొలిటిషియన్‌గా ఎదిగిన వ్యక్తి. టీడీపీకి, జనసేనకు హార్డ్‌కోర్ ఫ్యాన్. రోజా మాట్లాడితే చాలు.. ఆర్పీ సీన్‌లోకి వచ్చేస్తాడు. రోజమ్మకు స్ట్రాంగ్ పంచ్‌లు వేస్తుంటాడు. వారిద్దరి మధ్య పొలిటికల్ వార్ జబర్దస్త్‌ను మించి ఉంటుంది. లేటెస్ట్‌గా వైసీపీ వెన్నుపోటు దినోత్సవంలో మాజీ మంత్రి ఆర్కే రోజా వెరైటీ నిరసన తెలిపారు. చెవుల్ల బంతిపూలు పెట్టుకుని.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. రాష్ట్రమంతా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టినా.. రోజా చేసిన నిరసననే అందరికంటే హైలైట్ అయింది. ఇంకేం. కిరాక్ ఆర్పీ ఎంట్రీ ఇచ్చేశారు. రోజా ర్యాలీ, విమర్శలపై రివర్స్‌లో ఇచ్చిపడేశారు.
పూలా? ఏప్రిల్ ఫూలా?
తిరిగిన చోటే తిరిగింది.. తెగ తిరిగింది.. చెవిలో పువ్వులు పెట్టుకుంది.. అవి పూలా? ఏప్రిల్ ఫూలా? అంటూ రోజాపై అటాక్ స్టార్ట్ చేశారు ఆర్పీ. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవాన్ని చెడుగుడు ఆడేసుకున్నారు. ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడవలేదని.. సూపర్ సిక్స్ అమలు కాబోతున్నాయని అన్నారు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలు కాబోతోందని.. మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పథకాలు సైతం వచ్చే నెలలోనే అమల్లోకి వస్తాయని చెప్పారు. మిగిలిన మూడు పథకాలు సైతం త్వరలోనే చంద్రబాబు సర్కారు నెరవేరుస్తుందని అన్నారు.
జగన్‌దే వెన్నుపోటు
కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రోజా అంటోంది.. జగన్ హయాంలో అన్నీ వెన్నుపోట్లేగా అంటూ గుర్తు చేశారు కిరాక్ ఆర్పీ. గెలిచిన మొదటి నెలలోనే రూ.3వేలు పింఛన్ ఇస్తానని చెప్పిన జగన్.. నాలుగేళ్ల తర్వాత కానీ అమలు చేయలేదని విమర్శించారు. అదే చంద్రబాబు హయాంలో గెలిచిన వెంటనే.. మొదటి నెలలోనే పాత అమౌంట్ 3 వేలతో కలిపి.. రూ.7 వేలు ఒకటో తారీఖునే ఇచ్చారని గుర్తు చేశారు ఆర్పీ. ఈ రోజుకు కూడా రూ.4 వేలు.. ఒకటో తేదీనే.. నాయకులే ఇంటికి వెళ్లి.. పింఛను డబ్బులు టంఛనుగా అందిస్తున్నారని ఇదొక అద్భుతమన్నారు ఆర్పీ.
రూ.5 కే పేదలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను జగన్ హయాంలో కూల్చేసి.. చంద్రబాబుకు పేరు రాకుండా చేశారని మండిపడ్డారు రాంప్రసాద్. జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లను పశువుల కొట్టాలుగా, గంజాయి తాగే వారికి అడ్డాగా మార్చారన్నారు. చంద్రబాబు రాగానే 2వేలకు పైగా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి.. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి భోజనం పెడుతోందని చెప్పారు.
మెగా సర్కార్..
టిప్కో ఇళ్లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే 90 శాతం పూర్తి చేయగా.. జగన్ వచ్చాక రూ.వేల కోట్లతో వాటికి వైసీపీ రంగులు వేశారని తప్పుబట్టారు. అదే డబ్బులతో రిపేర్ చేయించి ఉంటే ప్రజలు ఇప్పటికే మంచి ఇళ్లల్లో ఉండేవారని అన్నారు. అధికారంలోకి రావడానికి జగన్ అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని.. హామీ ఇచ్చారే కానీ జగన్ హయాంలో ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. చంద్రబాబు సీఎం అయిన మొదటి ఏడాదిలోనే 16,347 టీచర్ల భర్తీ దిశగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.
మందు.. రోడ్లు..
మధ్యపానం నిషేధం అంటూ జగన్ నాసిరకం మందు అమ్మారని.. డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులన్నీ దోచేసి తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నారని ఆరోపించారు. అదే చంద్రబాబు రాగానే.. డిజిటల్ పేమెంట్స్‌తో మంచి సరుకు ప్రజలకు అందుబాటులో ఉంచారని చెప్పారు.
జగన్ హయాంలో రోడ్లు స్విమ్మింగ్‌పూల్స్, బావుల్లా ఉంటే.. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే అద్భుతమైన రోడ్లు వేస్తున్నారని.. గ్రామాల్లో రహదారులు సైతం హైవేల్లా ఉన్నాయన్నారు. ఇంకా అనేక అంశాలపై తనదైన స్టైల్‌లో మాస్ డైలాగులతో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కిరాక్ ఆర్పీ.