ఈరోజు వల్లభనేని వంశీని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు కొడాలి నాని, పేర్ని నాని. ఈ సందర్భంగా కొడాలి నాని వంశీని చూసి ఏంటి చిక్కిపోయావ్, డైటింగ్ చేశావా అని పలకరించారు. ఏం చెప్పాలో తెలియక వంశీ సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత పేర్ని నాని ఓ జోక్ పేల్చారు. వంశీ పక్కనే ఉన్నా కూడా చూసీ చూడనట్టు.. వంశీ ఎక్కడ అని ప్రశ్నించారు. ఆయన్ను గుర్తు పట్టనట్టే మాట్లాడారు. ఈరోజు వల్లభనేని వంశీ ఇంట్లో పరామర్శల పర్వం కామెడీగా సాగిపోయింది.
కృష్ణా : వల్లభనేని వంశీ నివాసానికి కొడాలి నాని..
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని. పేర్ని నాని..#vallabhanenivamsi #KodaliNani #AndhraPradesh pic.twitter.com/foE4n2hc81
— Telugu Stride (@TeluguStride) July 5, 2025
అందుకేనా?
జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీని చూస్తే ఎవరైనా అయ్యోపాపం అంటారు. అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని మాత్రం సింపతీ చూపించలేదు సరికదా ఏంటి చిక్కిపోయావ్, డైటింగ్ చేశావా అంటూ సెటైర్ వేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మూడీగా ఉంటున్న వంశీని తిరిగి యాక్టివ్ గా మార్చేందుకే ఆయన ఇలా జోక్ వేశారని సన్నిహితుల అభిప్రాయం. ఇక పేర్ని నాని విషయానికొద్దాం. వంశీ బెయిల్ పై బయటకు వచ్చే సమయంలో పేర్ని నాని ఆయన వెంటే ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి కూడా పలకరించారు. ఇప్పుడు మళ్లీ కొడాలి నానీని వెంటబెట్టుకుని వంశీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను గుర్తుపట్టనట్టే వంశీ ఎక్కడ అంటూ జోకులేశారు. ఆ నానీ కానీ, ఈ నానీ కానీ.. వంశీని కాస్త చిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన వంశీ మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు. మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు ఉండటం వల్లే ఆయన పెదవి విప్పలేదని అంటున్నా.. జైలు జీవితం వల్ల ఆయన కాస్త సైలెంట్ అయ్యారనే వాదన కూడా వినపడుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన వంశీ కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన్ను వదిలిపెట్టకుండా నీడలా వెంటాడటం విశేషం.
జగన్ పరామర్శ..
ఇక వల్లభనేని వంశీని కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు జగన్. వంశీపై జగన్ సింపతీ చూపించారు కానీ, అటునుంచి పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. జగన్ మెప్పు కోసమే వంశీ అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేసి టీడీపీకి టార్గెట్ అయ్యారు. వాస్తవానికి చంద్రబాబుని విమర్శించాల్సినంత రాజకీయ అవసరం వంశీకి లేదు, అందులోనూ ఆయన్ను మరీ పర్సనల్ గా టార్గెట్ చేయడం, కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడటం మరింత సంచలనంగా మారాయి. గతంలో వంశీ ఎవరిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీలో కీలకంగా మారేందుకు, జగన్ మెప్పుకోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకున్నారంతా. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన్ను వదిలిపెట్టేది లేదని పంతం పట్టారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక వంశీ దాదాపు 10 కేసుల్లో బుక్కయ్యారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత వైసీపీలో ఏ నేత కూడా ఇంతకాలం జైలులో లేరు. వంశీ ఏకంగా 138 రోజులపాటు జైలు జీవితం గడిపారు. దీంతో ఆయన దూకుడు తగ్గుతుందని అనుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన్ని పార్టీనుంచి దూరం కాకుండా చూసే ప్రయత్నాల్లో ఉన్నారు. పదే పదే పరామర్శల పేరుతో ఆయన్ను కలుస్తున్నారు. మరి వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.