BigTV English

One Big Beautiful Bill: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏమిటి..? భారత్‌కు లాభమా? నష్టమా?

One Big Beautiful Bill: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏమిటి..? భారత్‌కు లాభమా? నష్టమా?

One Big Beautiful Bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఇంట్రెస్ట్ గా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న చర్చలు జరుగుతున్నాయి. ఆహా ఓహో అని వైట్ హౌజ్, ట్రంప్, రిపబ్లికన్లు ప్రచారాలు పెంచారు. అదే సమయంలో ధనవంతులకే లాభం చేసి పేద అమెరికన్ల పొట్టకొట్టేలా ఉందని రిపబ్లికన్లు కార్నర్ చేస్తున్నారు. ఇంతకీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో PROS and CONS ఏంటి?


940 పేజీల బ్యూటిఫుల్ బిల్లుపై పెద్ద రగడ

940 పేజీల బిల్లు అమెరికాలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈ బిల్లు అందరి అటెన్షన్ కు కారణమైంది. సో ఈ బిల్లుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ రంగాలు ప్రభావితమయ్యాయన్నది చూద్దాం.


ట్యాక్స్ కట్స్ ను శాశ్వతం చేయడం

ఈ బిల్లు చట్టంగా మారడంతో ఎవరు లాభపడ్డారో ముందుగా చూద్దాం. 2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేయడం ద్వారా, ఈ బిల్లు అమెరికన్లకు సంవత్సరానికి సగటున 2,900 డాలర్లు ఆదా చేస్తుందని ట్యాక్స్ పాలసీ సెంటర్ అంచనా వేసింది. మధ్యతరగతి, అధిక ఆదాయం గల వ్యక్తులు అంటే ఏటా 30 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్లు సంపాదించేవారికి 15% ట్యాక్స్ తగ్గింపును పొందుతారు. ఇది వారి టేక్ హోమ్ పే ని ఏడాదికి 10 వేల డాలర్ల నుంచి 13 వేల డాలర్లకు పెంచనుంది. అధిక ఆదాయం ఉన్న వారు, అలాగే వారసత్వ ఆస్తులు ఉన్నవారు భారీగా ట్యాక్స్ రాయితీలు పొందుతారు. అటు మధ్యతరగతి కుటుంబాలు ట్యాక్స్ రిలీఫ్ ద్వారా రిలీఫ్ పొందుతాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు. ఇక ఏటా 9 లక్షలకు పైగా డాలర్లు సంపాదించే వారికీ బెనిఫిట్స్ ఇచ్చారు ట్రంప్. కార్పొరేట్ కంపెనీలకు లాభం జరగనుంది.

ఓవర్‌టైమ్‌పై 12,500 డాలర్లకు నో ట్యాక్స్ కట్

టిప్స్ లేదా ఓవర్‌టైమ్ ద్వారా సంపాదించే ఆదాయంపై 2028 వరకు ట్యాక్స్ రాయితీ ఉంటుంది. దీనివల్ల ఈ వర్గాల వారు సంవత్సరానికి 1,300 నుంచి 2 వేల డాలర్లు ఆదా చేయవచ్చు. టిప్స్‌పై 25 వేల డాలర్లు, ఓవర్‌టైమ్‌పై 12 వేల 500 డాలర్ల దాకా సంపాదించే వారికి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్. 65 ఏళ్లు పైబడిన వారికి అదనపు 4,000-6,000 డాలర్ల స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. 88% సీనియర్స్‌కు ట్యాక్స్ రహిత బెనిఫిట్స్ అందిస్తుంది. అటు అమెరికన్ తయారీ కంపెనీలు, అలాగే చిన్న వ్యాపారాలకు 100 శాతం ఎక్స్‌పెన్సింగ్ అలాగే ట్యాక్స్ రాయితీలు ఈ బ్యూటిఫుల్ బిల్లుతో లభిస్తాయి. దీనివల్ల వారు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించవచ్చు. వ్యాపార విస్తరణకు మేలు, అలాగే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

20 లక్షల US రైతు కుటుంబాలకు మేలు

ఎస్టేట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ రెట్టింపు కావడం వల్ల 20 లక్షల రైతు కుటుంబాలు తమ ఆస్తులను వారసత్వంగా ఇవ్వడంలో ట్యాక్స్ భారం నుండి రక్షణ పొందుతారు. దీంతో అమెరికన్ రైతులకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అమెరికన్ తయారీ కార్లపై ఆటో లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇచ్చారు. దీంతో అమెరికన్ కార్ల కొనుగోలును ప్రోత్సహిస్తుంది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా బిల్లులో ప్రస్తావించారు. అటు సైనిక రంగంలో ఆధునీకరణ, జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉద్యోగ సృష్టి, మౌలిక సదుపాయాల వృద్ధి కోసం బెనిఫిట్స్ కల్పించారు. ICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు అమెరికాకు వలసలను కఠినంగా నియంత్రించేలా చూసుకుంటున్నారు.

చారిటబుల్ డొనేషన్స్‌ను ప్రోత్సహించేలా బిల్లు

అటు యు.ఎస్. కోస్ట్ గార్డ్‌కు గణనీయంగా ఫండింగ్ పెంచారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధానికి, ఆర్కిటిక్‌లో జాతీయ భద్రత, సముద్ర రవాణా రంగంలో బలోపేతం అయ్యేలా బిల్లులో ప్రోత్సహించారు. ఏవియేషన్ రంగంలో సామర్థ్యం, భద్రత పెంచడానికి చర్యలు తీసుకున్నారు. చారిటబుల్ డొనేషన్స్‌ను ప్రోత్సహించేలా బిల్లు ఉంది. ఇది నాన్-ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ పెంచబోతోంది. న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, వృద్ధికి ప్రోత్సాహం కల్పించారు.

విద్యార్థుల లోన్లనూ టార్గెట్ చేసిన ట్రంప్

ఇక ఈ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్లుతో ఎవరికి నష్టమో ఇప్పుడు చూద్దాం. తక్కువ ఆదాయం ఉన్న వారిపై ట్రంప్ గట్టి దెబ్బే కొట్టాడు. సంవత్సరానికి 17 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారికి మెడికేడ్, ఆహార కోతల వల్ల సగటున 1,600 డాలర్ల నుంచి 22 వేల డాలర్లు నష్టపోవచ్చంటున్నారు. అసలు బెనిఫిట్ చేయాల్సిందే పేద అమెరికన్లకు. కానీ ట్రంప్ మాత్రం ఎందుకో పేద అమెరికన్ల పొట్టగొట్టాడంటున్నారు అక్కడి డెమొక్రాట్లు, సామాజిక సంస్థలు. అలాగే విద్యార్థుల లోన్లనూ టార్గెట్ చేశారు. స్టూడెంట్స్, అలాగే వర్శిటీలకు నష్టం.

క్లీన్ ఎనర్జీ రంగానికి ట్యాక్స్ క్రెడిట్స్ మైనస్

అటు క్లీన్ ఎనర్జీ రంగానికి ట్యాక్స్ క్రెడిట్స్ మైనస్ చేశారు. దీంతో సోలార్, విండ్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాలకు షాకింగ్ గా మారింది. ఈ బిల్లు స్పేస్ బేస్డ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ – గోల్డెన్ డోమ్ కోసం ఫండింగ్‌ను కేటాయించినప్పటికీ, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలకు అంటే జెఫ్ బెజోస్ సహా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి వాటికి నేరుగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేదా ఫండింగ్ పై స్పష్టత ఇవ్వలేదు. ఎలాన్ మస్క్ ఈ బిల్లును విమర్శించడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అటు వలసదారులకు వీసా ఫీజుల్ని పెంచారు. చాలా సబ్సిడీల నుండి ఇమ్మిగ్రెంట్స్‌ను మినహాయించేశారు. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా ఉన్న వలసదారులు చాలా నష్టపోతారు. సో ఈ బిల్లు వల్ల ఫెడరల్ డెఫిసిట్ $3.3-$3.8 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, దీనివల్ల భవిష్యత్ తరాలపై రుణ భారం పెరుగుతుందంటున్నారు. సో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ట్రంప్ ఉత్సాహంగా తీసుకొచ్చినా లాభ నష్టాలపై ఇంకా ఆందోళన తొలగడం లేదు.

అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపడానికి లిమిట్ పెట్టారా..

చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు NRIలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతోంది. అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపడానికి లిమిట్ పెట్టారా.. లిమిట్ దాటితే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఇంకెంత ఆర్థిక ప్రణాళికతో ఉండాలి? ఈ బిల్లుపై మస్క్ ఎందుకంత ఆవేశంగా ఉంటున్నారు? వచ్చే ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలపై ఈ బిల్లు ఎఫెక్ట్ చూపుతుందా?

బ్యూటిఫుల్ చట్టంతో NRIల పరిస్థితి ఏంటి?

బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికాలోనే జనం గరంగరం అవుతున్నారు. ముఖ్యంగా పేద అమెరికన్లకు ఇంకింత పరేషాన్ పట్టుకుంది. వాళ్ల సంగతి సరే.. మన NRI ల పరిస్థితి ఏంటి? డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్లిన వారికి ఈ బ్యూటిఫుల్ బిల్లు షేక్ చేయబోతోందా? ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచే NRIల నెత్తిపై ట్రంప్ పెద్దబాంబే పెట్టాడు. 2026 జనవరి 1 నుంచి అమెరికా నుంచి భారత్‌కు పంపే క్యాష్ ఆధారిత ట్రాన్స్ ఫర్స్ పై 1% పన్ను విధించారు.

తరచూ ఇండియాకు డబ్బు పంపే వారికి భారమే

క్యాష్, మనీ ఆర్డర్, చెక్కుల రూపణంలో పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించారు. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు ఒత్తిళ్లతో 1 శాతంగా డిసైడ్ చేశాడు ట్రంప్. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ ఇండియాకు డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది. అయితే డిజిటల్ మార్గాల్లో పంపే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడిన తల్లిదండ్రులకు నగదే అలవాటుగా ఉంది. ఉదాహరణకు ఏడాదికి 6 వేల డాలర్లు పంపే వ్యక్తికి 60 డాలర్లు అంటే 5 వేల రూపాయలు అదనంగా ట్యాక్స్ చెల్లించాలి.

1% రెమిటెన్స్ ట్యాక్స్ ఎఫెక్ట్ తో మన ఎకానమీపై భారం

బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ ట్యాక్స్ ఎఫెక్ట్ కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనే ఉండనుంది. రెమిటెన్స్ అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచి తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం. 2023-24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే 1% పన్ను విధానం వల్ల 10-15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12-18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. ఫస్ట్ విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత కుటుంబ అవసరాలపై ఎఫెక్ట్, చివరికి డిపాజిట్లు తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపుతుంది.

H-1B, L-1 వీసాలు, అసైలం అప్లికేషన్లకు భారీ ఛార్జ్ లు

ఈ చట్టంతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయ దరఖాస్తులకు భారీ ఛార్జ్ లు వడ్డించారు ట్రంప్. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్‌లో ఫైన్లు విధించాలని నిర్ణయించారు. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు పెంచుతున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.

కఠినమైన KYC రూల్స్, NRE/NRO ఖాతాలపై కంట్రోల్

కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ చట్టంలో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ట్యాక్స్ రీఫండ్‌లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైలకు నష్టమే. ఈ బిల్లు ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని కల్పించింది.
ఎలాంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే ఛాన్స్ ఉంటుంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై కంట్రోల్ ఉంటుంది. దీంతో పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పేపర్స్ సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే విషయంపై మరింత నిఘా ఉండబోతోంది. ట్యఆక్స్ రీఫండ్‌లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ బెనిఫిట్స్ పొందలేరు.

బడ్జెట్ లోటును 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందన్న మస్క్

ఈ బిల్లుపై అటు డెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు, ఎలాన్ మస్క్ వంటి వాళ్లు మండిపడుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్స్ అంటున్నారు. ఈ బిల్లు సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం అని కౌంటర్లు వేస్తున్నారు. ఈ చట్టం దుర్మార్గం అని ఎస్క్ ఫైర్ అయ్యారు. అవసరమైన వాటిని వదిలేసి వ్యర్థ ఖర్చులను పెంచుతుందన్నాడు. దీంతో యు.ఎస్. బడ్జెట్ లోటును 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని, అమెరికన్ పౌరులపై రుణభారం మోపుతుందన్నాడు మస్క్. అమెరికాను దివాళా తీయించే చట్టం ఇది అని అన్నాడు. రిపబ్లికన్లకు పొలిటికల్ సూసైడ్ అన్నాడు. అమెరికాలో కొత్త పార్టీకి కూడా సై అన్నాడు మస్క్.

అద్భుతమైన బిల్లు అంటున్న ట్రంప్

మరోవైపు ట్రంప్ మాత్రం మస్క్ విమర్శలను సింపుల్ గా తీసుకున్నాడు. ఈ బిల్లు అద్భుతమైందంటూ చెప్పుకున్నాడు. ఆర్థిక వృద్ధిని పెంచుతుందంటూ కొత్త లెక్కలు చెబుతున్నాడు ట్రంప్. మరి ఈ చట్టం రిపబ్లికన్లకు నిజంగానే శాపంగా మారుతుందా.. వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమెరికాకు వలస వెళ్లిన వారు చేస్తున్న పనితో అమెరికా అభివృద్ధిలో NRIలు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కీలకంగా ఉన్నారు. బ్యూటిఫుల్ బిల్లు అని చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ట్రంప్ కు రాజకీయంగా గడ్డుకాలమే అన్న విమర్శలు పెరుగుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×