Ram Prasad Reddy: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసకర పాలనకు తెరదించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా అరాచకాలపై ఉక్కుపాదం
సమాజంలో అశాంతిని రేకెత్తించేలా, మహిళలు మరియు రాజ్యాంగ వ్యవస్థలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ వంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఏ రకంగా తప్పవుతుందని ప్రశ్నించారు. సమాజానికి హానికరంగా మారిన ‘రావణ్’ అనే వ్యక్తిపై ఉపా (UPA) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి అతడిని ఒక స్వాతంత్య్ర సమరయోధుడిలా చిత్రీకరించడం అత్యంత సిగ్గుచేటని దుయ్యబట్టారు.
అమరావతిపై వైఖరి..
అసెంబ్లీ, పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లు ఆమోదం పొందితే.. దాన్ని జగన్ తప్పుబట్టడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. మూడు రాజధానులనే ఒక అర్థం లేని నినాదంతో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, దీనివల్ల ఏపీ ఏకంగా 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ కేవలం ఐదేళ్లపాటు శిలాఫలకాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.
Also Read: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!
అభివృద్ధి పథంలో ఏపీ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి వివరించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, నేడు దేశానికే అది ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఐబీఎం, ఐఐటీలు వంటి అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ
మరోవైపు నిరుద్యోగుల కల సాకారం చేస్తూ మెగా డీఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని మంత్రి తెలిపారు. పొగాకు, మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నామని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ ‘గ్లోబల్ ప్లాన్’ ఏంటంటే?