TDP Vs YCP: ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. మేం తెచ్చాం.. మీరు పప్పుబెల్లాల్లా ప్రైవేట్ కు అమ్మేస్తున్నారని జగన్ అంటుంటే.. భూములిచ్చి రిబ్బన్ కట్ చేసినంత ఈజీ కాదని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చింది తామే అని జగన్ అంటుంటే.. ఎక్కడ పూర్తి ఆపరేషనల్ చేశారో చెప్పాలని సీఎం ఘాటు రిప్లై. సో అసలు ఏపీలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? కొత్తగా వచ్చినవేంటి.. నడుస్తున్నవెన్ని? కూటమి సర్కార్ చెబుతున్నట్లు PPP పద్ధతిలో దశ మారుతుందా? మెడికల్ కాలేజీలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయ్?
భూకేటాయింపులు చేస్తే కాలేజీలు నడుస్తాయా?
ఓవైపు జగన్, ఇంకోవైపు చంద్రబాబు సై అంటే సై అంటున్నారు. మేం మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు అమ్మేస్తారా అని జగన్ క్వశ్చన్ చేస్తుంటే.. భూమి కేటాయించి రిబ్బన్ కట్ చేసి వదిలేస్తే కాలేజీలు నడుస్తాయా అని సీఎం కౌంటర్ చేశారు. అసలు ఏది కరెక్ట్? జగన్ అభ్యంతరాలేంటి… కూటమి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో అసలు కథేంటో డీకోడ్ చేద్దాం.
పీపీపీ కింద 10 మెడికల్ కాలేజీల డెవలప్
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీలో చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో సెట్ చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద చేపట్టాలని డిసైడ్ చేశారు. సెప్టెంబర్ 4న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం PPP మోడల్ కింద 10 మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలని ఆమోదం తెలిపింది. ఫేజ్-1 కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను డెవలప్ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కోసం ఇప్పటికే రెడీ అయిన రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 6 కాలేజీలు ఫీజబులిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్ RFP రెడీ అయ్యాక పీపీపీ విధానంలోకి వెళ్లనుంది. పీపీపీ కోసం కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. రైట్… అసలు ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ ఏం జరుగుతోందో.. ఇక్కడి వరకు ఓ క్లారిటీ ఉంది.
అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామన్న జగన్
ఇది ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని వైసీపీ అంటుంటే.. కేవలం బిల్డింగ్స్, ఇన్ఫ్రా వరకు మాత్రమే ప్రైవేట్ వారు చూసుకుంటారని ఇతర యాజమాన్యమంతా ప్రభుత్వానిదే అని కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే.. ఈ PPP మోడల్ కింద ఉన్న అన్ని టెండర్లను రద్దు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇస్తున్నారు. తమ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదు చోట్ల తరగతులూ ప్రారంభించామని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్‌లో వాటి విలువ లక్ష కోట్లు పైనే ఉంటుందని, కోట్ల మంది ప్రాణాలను కాపాడగలుగుతాయన్న మాట వినిపిస్తున్నారు.
PPPలో చేస్తే డిజైన్, ఫైనాన్సింగ్ అమలు ఈజీ
ఇక్కడ జరిగేదేంటంటే.. గత YSRCP ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ప్రభుత్వ రంగంలో అమలు చేయాలని చూశారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేకప్ చేసే బదులు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కు మార్చారు. ప్రభుత్వం చెబుతున్న విషయాల ప్రకారం PPPలో చేస్తే… డిజైన్, ఫైనాన్సింగ్ అమలును ఈజీ చేస్తాయని, ప్రాజెక్ట్ కెపాసిటీని మెరుగుపరుస్తాయని, మనం పెట్టే ప్రతి పైసాకూ లాంగ్ టర్మ్ వాల్యూ అందిస్తాయంటోంది. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ఈ పీపీపీలో చేస్తామంటున్నారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా నిర్మాణం పూర్తి చేసే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మాణానికి మాత్రమే పరిమితం అని ప్రభుత్వం అంటోంది. కాలేజీల పూర్తి యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటున్నారు. సగంసగం పనులతో అసలు కాలేజీలు నడుస్తాయా అన్నది కూటమి ప్రభుత్వం సూటి ప్రశ్న. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందన్నారు. అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అసలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని ఘాటు కౌంటర్ ఇచ్చారు. పునాది వేయడం, రిబ్బన్ కటింగ్ చేయడం, ఏదే చేసేశామని చెప్పడం కాలేజీని నడిపే విధానం ఇదేనా అని సీఎం క్వశ్చన్ చేస్తున్నారు.
ఏటా రూ.360 కోట్ల ఖర్చు చేశారన్న సత్యకుమార్
అటు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం సంవత్సరానికి 360 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించిందంటున్నారు. 2023-24లో ప్రారంభమైన ఐదు మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్కటి 150 సీట్లతో పోలిస్తే, 2024లో NMC పాడేరుకు 50 సీట్లను మాత్రమే ఆమోదించిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 84 శాతం పూర్తయినప్పటికీ NMC అంచనాల ప్రకారం 48 శాతం బోధనా సిబ్బంది కొరతతో ఉందన్నారు. మోడీ విధానాలతోనే దేశంలో, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, అందులోనూ రకరకాల నిధులను దారి మళ్లించి ఒక్క మెడికల్ కాలేజీని కూడా జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని ఫైర్ అయ్యారాయన.
సో… చేసే పని పకడ్బందీగా చేద్దాం.. మధ్యలో వదిలేసేలా వద్దు అన్నది కూటమి ప్రభుత్వం మాట. బోధనా సిబ్బంది ఉంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేకపోవడం, మౌలిక వసతులు ఉంటే డాక్టర్ల కొరత, ఇలా సగం సగం వద్దు అంటున్నారు. అందుకే PPP మోడల్ తెరపైకి తెచ్చామని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు.. ఇదీ వైసీపీ ప్రశ్న. మీరే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు.. ఇది టీడీపీ క్వశ్చన్. సో రెండువైపులా డైలాగ్ లు పేలిపోతున్నాయ్. పీపీపీ రద్దు చేసుకోకపోతే ఉద్యమమే అని వైసీపీ నేతలు అంటున్నారు. మీ సంగతేంటో లెక్కలతో సహా తేలుస్తామని కూటమి సర్కార్ అంటోంది. ఇంతకీ పీపీపీ పాస్ అవుతుందా.. ఫెయిల్ అవుతుందా?
2024కి ప్లాన్ చేసిన ఐదింటిలో రెండింటికే ఆమోదం
ఏపీలో వైసీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రకటించారు. 2023లో మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, విజయనగరంలో ఐదు ప్రారంభించారు. 2024కి ప్లాన్ చేసిన ఐదింటింలో కేవలం రెండు మాత్రమే ఆమోదం పొందాయి. అందులో ఒకటి పాడేరులో 50 సీట్లు, మరొకటి పులివెందుల. ఆదోని, మదనపల్లి, మార్కాపూరానికి అనుమతి రాలేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024-25 సంవత్సరానికి పులివెందుల మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 ఆగస్టు 16 పర్మిషన్ లెటర్ పంపింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 10న దీన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎందుకంటే పనులు మొత్తం పూర్తికాలేదు. అసంపూర్ణంగా మౌలిక సదుపాయాలున్నాయి. బోధనా సిబ్బంది కొరత ఉంది. పర్ ఫెక్ట్ గా చేద్దాం అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారంటున్నారు. పర్మిషన్ ఇచ్చినా వెనక్కు పంపారని కౌంటర్ చేయడం వెనుక రీజన్ ఇదే అంటున్నారు. తమ ప్రణాళికతో ముందుకెళ్లి ఉంటే 2024-25లో నాలుగు కాలేజీలు, 2025-26లో 7 కాలేజీలు మొదలయ్యేవంటున్నారు జగన్. టెండర్లు రద్దు చేసే వరకు ఎక్కడి వరకైనా సిద్ధమే అంటున్నారు.
రూ.2,425 కోట్లలో 533 కోట్లే ఖర్చు చేశారా?
మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్ చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఎవరేం చేశారో తేలిపోతుందన్నారు. గతంలో సిద్ధం సిద్ధం అన్నారని, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని చంద్రబాబు కౌంటర్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలకు కేటాయించిన 2,425 కోట్లలో 533 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 2023 జులై నుంచి 188 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయంటోంది. అంతే కాదు అన్ని మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు నిలిచిపోయాయంటోంది. అసంపూర్తిగా ఉన్న పెనుకొండ మెడికల్ కాలేజ్ దగ్గరికి మంత్రి సవిత వెళ్లారు. అక్కడ ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. అసలు గత ప్రభుత్వం చేపట్టిన ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాల వెనుక కూడా స్కాములున్నాయని, అసెంబ్లీకి వస్తే అన్ని వివరాలు చెబుతామంటూ కౌంటర్ ఇచ్చారు.
Also Read: నేపాల్ నుంచి సురక్షితంగా తిరుపతి విమానాశ్రయానికి రాయలసీమ జిల్లాల వాసులు
సో కూటమి ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే.. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో పకడ్బందీగా పూర్తి చేస్తే.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక్కోకాలేజీకి 150 MBBS సీట్లు కేటాయిస్తుందంటున్నారు. గత ప్రభుత్వం ఈ కాలేజీలను అసంపూర్తిగా వదిలేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపిస్తున్నారు. ఐదు కాలేజీలను ప్రకటించినప్పటికీ తరగతులు ప్రారంభం కాలేదని, హాస్టళ్లు సిబ్బంది లేరని, 2023-24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం నంద్యాలలో సౌకర్యాలు కూడా సరిగా లేవంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 8,500 కోట్ల బడ్జెట్‌లో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సో ఇది ఇక్కడికి ఆగిపోయేలా కనిపించడం లేదు. పీపీపీ చుట్టూ పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
Story By Vidya Sagar, Bigtv