ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (Mega PTM) గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 53 లక్షల 40వేలమంది పేరెంట్స్, టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు కూడా పాల్గొన్నారు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం కోటిన్నరమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జులై 10న ఈ కార్యక్రమం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహించారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ భారీ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.
ఈ విజయం ఉపాధ్యాయులదే..
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కుతుందని ఆరోజే ప్రభుత్వం అంచనా వేసింది. గిన్నిస్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమ వివరాలు సేకరించారు. తాజాగా వారు గిన్నిస్ రికార్డ్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ విజయం ఉపాధ్యాయులకు అంగితం అని అన్నారాయన. ఈ గిన్నిస్ రికార్డ్ సాధించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు దక్కిన ఫలితం ఇదని అన్నారు లోకేష్.
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజున ఏపీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు స్కూల్ ఆవరణలోనే భోజన ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా విద్యార్థులతో కలసి నేలపైనే కూర్చుని భోజనం చేశారు.
MEGA PTM 2.0
ఏపీలో ఈ ఏడాది జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి MEGA PTM 2.0 గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలను LEAP యాప్ ద్వారా క్రమపద్ధతిలో సేకరించారు. ఈ అవార్డును నిర్ధారించడానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు పనిచేశారు. 61,000 పైగా పాఠశాలలను సందర్శించి డేటా సేకరించారు. చివరిగా వారు అన్నీ నిర్థారించుకున్న తర్వాత గణాంకాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తూ గిన్నిస్ రికార్డ్ ని ప్రకటించారు. ఈ గిన్నిస్ రికార్డ్ పట్ల పలువురు నేతలు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్ర విద్యా శాఖ తన ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఈ అవార్డు ఇంధనంగా నిలుస్తుందని అన్నారు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు. ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని ప్రభుత్వం అందుకుంటుంది.