Simhadri Appanna Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుఝామున గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులకు విశ్రాంతి, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటన తొలిపావాంచా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో అదృష్టవశాత్తు షెడ్డు కింద భక్తులు లేకపోవడంతో.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడ భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
షెడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం
గిరిప్రదక్షణలు చేసే భక్తుల కోసం షెడ్డు ఏర్పాటు చేశారు. అయితే స్తంభాల కింద కాంక్రీట్ వేయకుండా రేకుల షెడ్డు నిర్మాణ చేశారు. అది బరువు ఎక్కువై కూలిపోయింది. ఆ సమయంలో షెడ్డు కింద భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ప్రతిరోజూ వేలాది భక్తులు
సింహాచలం ఓ ప్రముఖ పవిత్ర క్షేత్రం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అప్పన్న స్వామిని దర్శించేందుకు వస్తుంటారు. ముఖ్యంగా గిరిప్రదక్షిణ చేసేవారు.. తొలిపావాంచా ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు.. ఈ షెడ్డు క్రింద నిలుచుంటారు.
భక్తుల ఆందోళన
ఈ ఘటన తర్వాత భక్తులు బాధ్యతారహిత వ్యవహారంపై.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల కోసం షెడ్డు ఏర్పాటు చేయడం మంచిదే కానీ, నిర్మాణంలో నాణ్యత లేదంటే అది మరింత ప్రమాదకరం. ఎవరైనా ఉండి ఉంటే పెను ప్రమాదమే జరిగేదంటూ భక్తులు తీవ్ర ఆందోళన చెందారు.
ప్రశ్నించాల్సిన అవసరం
ఈ షెడ్డు ఎవరి పర్యవేక్షణలో వేసారు? నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా? ఇంజినీరింగ్ నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రతపై అధికారులు స్పందించాలి
ఇలాంటి ప్రదేశాల్లో భద్రతే అత్యంత ప్రాధాన్యం. భక్తులు గిరిప్రదక్షణ చేసేటప్పుడు అలసటతో విశ్రాంతి అవసరం అవుతుంది. అలాంటి చోట్ల తాత్కాలిక నిర్మాణాలు ఉండొచ్చుకానీ, అవి గట్టిగా, సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటనతో సంబంధిత శాఖలు సకాలంలో స్పందించి, అన్ని తాత్కాలిక నిర్మాణాల భద్రతా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను చంపిన భార్య
ఈసారి భక్తులపై దేవుడు కరుణ చూపినట్లే. షెడ్డు కూలినప్పుడు ఎవరూ లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. అయితే ఇది భద్రతా ల్లోపాలను బహిర్గతం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.