BigTV English

Ambati: శవాల మీద పేలాలు ఏరుకున్నారా?.. మంత్రి అంబటి రాజీనామా చేస్తారా?

Ambati: శవాల మీద పేలాలు ఏరుకున్నారా?.. మంత్రి అంబటి రాజీనామా చేస్తారా?

Ambati: అంబటి రాంబాబు. ఏపీలో ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉండే నాయకుడు. మంత్రి కాకముందు ఆయనపై అనేక మరకలు. అరగంట.. గంట.. ఎపిసోడ్ తో బాగా అన్ పాపులర్ అయ్యారు. అలాంటిదే మరో మహిళతో ఫోన్ కాల్ యవ్వారంలోనూ రాంబాబు గొంతు వినిపించింది. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి రావడం మరింత ఆసక్తికరం. మంత్రి హోదా.. తెల్ల జుట్టుతో.. పెద్దరికమైతే తెక్కిపెట్టుకున్నారు. కానీ, ఆయనది చిన్నబుద్ధి అంటూ మరోసారి వివాదం తలెత్తింది. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు.. ఓ ఇంటి కొడుకు చనిపోతే.. ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటిస్తే.. అందులో సగం సొమ్ము తనకు ఇవ్వాలంటూ బెదిరించారని అంబటిపై ఆరోపణలు వచ్చాయి. ఆ కుటుంబం సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం.. అది కాస్తా వైరల్ కావడంతో.. మంత్రి ఉలిక్కిపడ్డారు. తనకేం సంబంధం లేదని.. నిరూపించాలని.. రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మధ్యలో జనసేన ఎంట్రీ ఇవ్వడంతో విషయం రచ్చ రచ్చగా మారింది. ఇవిగో ఆధారాలు అంటూ జనసేన నాయకులు రంగంలోకి దిగి.. అంబటి రాజీనామాకు ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే అంబటి ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో కాక రేపుతోంది.


అసలేం జరిగిందంటే..
సత్తెనపల్లిలో ఉంటున్న తురక పర్లయ్య, గంగమ్మల కుమారుడు అనిల్‌ (17) ఆగస్టు 20న పట్టణంలోని వినాయక హోటల్‌లో డ్రైనేజీ గుంతలో మురుగు తీస్తూ చనిపోయాడు. దీంతో 20 రోజుల క్రితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 5 లక్షల చెక్కు వచ్చింది. అందులో 2.50 లక్షలు ఇవ్వాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త అడిగారని.. దీనిపై మంత్రి అంబటి రాంబాబును కలిస్తే సొమ్ము ఇవ్వాల్సిందేనని బెదిరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. వాళ్లడిగింది ఇవ్వాల్సిందేనని సీఐ సైతం బెదిరించాడని.. లేదంటే సంక్షేమ పథకాలేమీ రావని.. స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తుందని సీఐ అనడంతో చచ్చిపోవాలనుకున్నామని.. కానీ మా అమ్మాయి ఎలా బతుకుందని ఆగాం.. అంటూ తురక పర్లయ్య, గంగమ్మలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విషయం తెలిసి జనసేన నేతలు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ సైతం ప్రశ్నించారు. తురక పర్లయ్య కుటుంబానికి అండగా నిలిచారు. “మా నాయకుడిపైనే ఆరోపణలు చేస్తారా? మీ కుమార్తె బడికి ఎలా వెళ్తుందో చూస్తాం. మీరెలా బతుకుతారో చూస్తాం.. అంటూ తురక పర్లయ్య, గంగమ్మలను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు విలేకర్లకు తెలిపారు. ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు చెప్పారు.


వివాదం ముదరడంతో మంత్రి అంబటి రాంబాబు సైతం స్పందించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడిన 12 మంది రైతులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదని.. చేతనైతే పవన్ కల్యాణ్ నిరూపించాలని అంబటి సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించలేక సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని ఈ అంశానికి ముడిపెట్టారని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ తనకు పట్టలేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి తాను 2 లక్షలు తీసుకున్నానని నిరూపిస్తే.. తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు.

మంత్రి సవాల్ పై జనసేన నేతలు మళ్లీ రియాక్ట్ అయ్యారు. “అయ్యా అంబటి ఎక్కడ దాక్కున్నావ్.. ఎక్కడికి పారిపోయావు. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా అన్నావు. ఇదిగో నీ లంచాల బాగోతం నిరూపించాం. ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు. రేపల్లె నుంచి పారిపోయి వచ్చినట్లు సత్తెనపల్లి నుంచి కూడా పారిపోయావా. తురకా పర్లయ్య దంపతులకు తక్షణమే పరిహారం చెక్కు ఇవ్వాలి. అవసరమైతే జనసేన ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. ఆ దంపతులకు ఏదైన హానీ జరిగితే అంబటి రాంబాబుదే బాధ్యత. మంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది” అంటూ జనసేన నేతలు తేల్చి చెప్పడంతో అంబటి కేంద్రంగా రాజకీయం రంజుగా మారింది.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×