Ravindra on Perni Nani : భార్యను అడ్డపెట్టుకుని పేర్ని నాని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో పేర్నీ నాని భార్య జయసుధకి చెందిన ఓ గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పై కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే.. కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పేర్ని నాని.. ఏపీలోని ఓ మంత్రి తన భార్యను ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణులు చేశారు. మహిళలపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కొల్లు రవీంద్ర.. తప్పు చేసిన వాళ్లు ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా శిక్ష తప్పదని తెల్చి చెప్పారు. మహిళలు తప్పు చేస్తే శిక్షించవద్దని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం నిల్వ చేసిన గోదాము నుంచి ఏకంగా 7,755 బస్తాల రేషన్ బియ్యం కనిపించకుండా పోతే ఎలాంటి చర్యలు చేపట్టవద్దా అని పేర్ని నానిని ప్రశ్నించారు. పేర్ని నానికి ఇకపై నిద్ర లేని రాత్రులు తప్పవని హెచ్చరించిన కొల్లు రవీంద్ర.. 7,577 బస్తాల పేదల బియ్యాన్ని అక్రమ మార్గంలో తప్పించి, నీతి కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలోని పేదలకు పంచాల్సిన బియ్యాన్ని సొమ్ముచేసుకోవడమ కాకుండా.. నిందలు మోపుతున్నారు అంటే ఎలా అని ప్రశ్నించారు.
ఆడవాళ్లపై కేసులు పెట్టవద్దని చెబుతున్న పేర్ని నాని.. భార్య పేరుతో గోదాము ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది?అని అడిగారు. తాను పేర్ని జయసుధ అరెస్టుకు పట్టుబడుతుంటే, సీఎం వద్దన్నారు అంటూ మీడియాలో నాని చెప్పడాన్ని పెద్ద జోక్ అన్న మంత్రి కొల్లు రవీంద్ర… భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బియ్యం కుంభకోణాంనికి సూత్రధారి, పాత్రధారి పేర్ని నానినే అంటూ తేల్చేశారు. పేర్ని నాని తల కిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని అన్నారు. రేషన్ బియ్యాన్ని క్రమంగా ఎగుమతి చేసి డబ్బులు సంపాదించారు కాబట్టే.. నెల రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు అంటూ కొల్లు రవీంద్ర ఆరోపించారు. దొంగతనం చేసి డబ్బులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన దొర అయిపోడు, దొంగ దొంగే అంటూ వ్యాఖ్యానించారు.
నాడు అసెంబ్లీలో జరిగింది మర్చిపోయారా..
తన భార్య పేరును వాడకుంటూ రాజకీయాలు చేస్తున్న పేర్ని నాని.. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారన్న కొల్లు రవీంద్ర.. అంతకంటే ముందు నాడు అసెంబ్లీలో ఏం చేశారో మరిచిపోయారా.? అని ప్రశ్నించారు. సభతో కానీ, రాజకీయాలతో కానీ సంబంధం లేని నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు మీ గుణం ఎక్కడ ఉంది?, ఆడబిడ్డలపై కేసులు పెట్టి, స్టేషన్ల చుట్టూ తిప్పి, జైళ్లలో పెట్టినప్పుడు మీ గుణమేమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బియ్యం మాయం కేసులో మేనేజరే మొత్తం చేశాడని చెబుతున్న పేర్ని నాని.. అతన్ని ఎందుకు దాచిపెట్టాడని అడిగారు.
కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత క్రూరంగా వ్యవహరించారో మర్చిపోవద్దని గుర్తు చేసిన కొల్లు రవీంద్ర.. గతంలో తన అనుచరుల్ని అక్రమ కేసుల్లో ఇరికించిన విషయాన్ని గుర్తు చేసారు. వారిని కాళ్లూ చేతులు కట్టేసి కొట్టారని, తనపైనా అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు. కర్మ ఫలం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న కొల్లు రవీంద్ర.. కేసుల భయంతో చనిపోయిన తల్లిపై ప్రమాణం చేయడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. మహిళలపై కేసు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారని, మరి మహిళలు తప్పు చేస్తే శిక్షించకూడదా? అని అడిగారు. బియ్యం అక్రమ రవాణా కుట్రలో తన పాత్ర ఉంది కాబట్టే అరెస్టు తప్పదనే భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : పేర్ని నానికి జేసీ కౌంటర్, వీపు విమానం మోత మోగిస్తా
పేర్ని నానితో పాటు అతని బినామీలకు కూడా చుక్కలు చూపిస్తామని తేల్చి చెప్పారు. త్వరలోనే పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తాని తెలిపిన కొల్లు రవీంద్ర.. అక్రమాలన్నీ బయటపెడతామన్నారు. పోర్టు సమీపంలో ప్రజల భూముల్ని అడ్డగోలుగా లాక్కున్నారని, ఇళ్ల స్థలాల పేరుతో 450 ఎకరాల భూ కుంభకోణం చేశారని ఆరోపించారు. ఈ కేసుల్లో భూమండలంలో ఎక్కడ దాక్కున్నా.. వదిలిపెట్టేది లేదన్నారు.