Tata Jobs in AP:: ఏపీ కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా అడుగులు వేస్తోంది. మొదటి అడుగులోనే భారీ పెట్టుబడిని కూటమి సాధించింది. ఈ పెట్టుబడి రాకతో ఏకంగా 7,50,000 ఉద్యోగాలు రాష్ట్ర యువత దరిచేరనున్నాయి. ఇంత భారీ సంఖ్యలో యువతకు ఉపాధి దక్కే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, స్వర్ణాంధ్ర 2047 విజన్ తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సైతం దూరమయ్యాయని పలుమార్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఏపీలో పెట్టుబడుల సాధనకు కృషి చేస్తుందని, స్వర్ణాంధ్ర 2047 విజన్ డైరీ ఆవిష్కరణ సమయంలో సీఎం చంద్రబాబు చెప్పారు.
అదే రీతిలో కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సాధనకు నిరంతరం కృషి చేస్తోంది. ఇటీవల దావోస్ పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు దావోస్ పర్యటన అనంతరం నారా లోకేష్ ప్రకటించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు, రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు రూ. 49 వేల కోట్ల భారీ పెట్టుబడిని రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెట్టేందుకు టాటా పవర్ అంగీకరించింది.
దీనితో మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ అనుబంధ సంస్థ ప్రతినిధులు ఎంఓయూ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు టాటా పవర్ తో ఒప్పందం జరిగిందని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.
టాటా సంస్థతో ఒప్పందం జరగడంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 7000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 7.5 లక్షల ఉద్యోగాలు దరిచేరడం ఇదొక శుభసూచకమని లోకేష్ అభిప్రాయపడ్డారు.
Also Read: AP Cabinet: కాకినాడ దశ తిరుగుతోందా? ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..
ఈ ఒప్పందంతో మన ఆర్థిక వ్యవస్థ బలపడడంతో పాటు క్లీన్ ఎనర్జీ సాధ్యమవుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్లీన్ ఎనర్జీ భవిష్యత్తుకు చిరస్మరణీయ ముందడుగని లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఏపీలో భారీ పెట్టుబడి రాకతో, కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సాధనలో విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.