AP Students: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను ఎప్పటినుండి అమలు చేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్నత పాఠశాల స్థాయి చదువుల కోసం విద్యార్థులు పుస్తకాల రూపంలో అధిక బరువులను మోస్తున్న పరిస్థితి. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో, ఆరోజున విద్యార్థులు తమకు అప్పగించిన హోంవర్క్ పూర్తి చేసే పనిలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే తమకు దొరికిన కొద్ది సమయంలో ఆటపాటలకు సమయాన్ని కేటాయిస్తారు.
ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడం, బడి అంటే భయాన్ని పోగొట్టడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి నారా లోకేష్ ఓ ప్రకటన జారీ చేశారు. ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలైతే ప్రతి శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాల బరువులతో వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Also Read: Prakasam Crime: అన్నా నువ్వే దిక్కని వస్తే.. పక్కా ప్లానేసి మరీ చంపేశాడు
అలాగే గత ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి తీసుకువచ్చిన జీవో 117 పై కూడా సంబంధిత అధికారులతో నారా లోకేష్ చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించి, ఈ జీవో పై అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని కనుగొనాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పండుగ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.