1930ల నుంచి తెలుగు సినిమా నిర్మాణానికి మద్రాస్ ప్రధాన కేంద్రంగా ఉండేది. విజయ-వాహిని, ప్రసాద్ వంటి స్టూడియోలు తెలుగు సినిమా ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో.. హైదరాబాద్‌లోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1956లో సారథి స్టూడియోస్ ఏర్పాటు.. హైదరాబాద్ సినీ ప్రయాణంలో కీలకమైన తొలి అడుగుగా చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత ఆ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. అప్పటికే ఆయన మద్రాస్‌లో స్టార్ హీరో. అయినప్పటికీ.. తెలుగు సినిమా తన సొంత రాష్ట్రంలోనే బలమైన స్థావరం ఏర్పరుచుకోవాలని ఆయన భావించారు. 1975లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది వేసి 1976లో దీన్ని ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ వైపు మరింత మంది సినీ ప్రముఖుల దృష్టి మళ్లింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఈ మార్పుకు ఊతమిచ్చాయి. సినిమా షూటింగ్‌లకు రాయితీలు, మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్ క్రమంగా ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగింది.
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. రామకృష్ణ, పద్మాలయ, రామానాయుడు వంటి స్టూడియోలు.. హైదరాబాద్ సినీ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అయితే.. ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు.1980ల చివరి నుంచి 1990ల వరకు మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు సినీ కార్యకలాపాలు క్రమంగా తరలివచ్చాయి. 1996లో రామోజీ ఫిల్మ్‌సిటీ రావడంతో.. హైదరాబాద్ దేశంలోని ప్రధాన సినిమా నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా మరింత బలపడింది.
Also Read: 80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..
Also Read: 80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..