Sathya Kumar Yadav on Peddireddy: ఇప్పటికే ఒక్కొక్క నేత పార్టీని వీడుతుంటే అర్థం కాని పరిస్థితి వైసీపీదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీకి ఎంత ఊపిరి పోయాలని మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నా, నాయకులు మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. లీడర్స్ వెళ్లినా క్యాడర్ మారదనే ధీమా వైసీపీ అధినాయకత్వంలో ఉంది. అయినా కూటమి నేతలు మాత్రం ఒక్కొక్కరిగా వైసీపీ లక్ష్యంగా విమర్శలు సాగిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వైసీపీని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే పనిలో పనిగా పెద్దిరెడ్డి పై తీవ్ర స్థాయిలో మంత్రి మండిపడ్డారు.
తిరుపతి రోటరీ క్లబ్ సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సొంత సామాజిక వర్గం నేతలే పార్టీని వీడుతుంటే ఏం చేయాలో తెలియక సూపర్ సిక్స్ అమలు చేయలేదంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ రూ. 1000 లు పెంచడానికి 5 సంవత్సరాల కాల పరిమిత తీసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్లను పెంచి పంపిణీ చేసామని, ఒకేసారి పింఛన్ నగదు పెంచిన ఘనత కూటమికే దక్కుతుందన్నారు.
వైసీపీకి చెందిన మాజీ నేత విజయసాయిరెడ్డి వైసీపీలో ఉండలేక బయటకు వచ్చారన్నారు. సాయిరెడ్డి బీజేపీలో చేరికపై సత్యకుమార్ మాట్లాడుతూ.. ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నాడు. మా పార్టీలోకి ఎందుకు వస్తారంటూ మీడియాను ప్రశ్నించారు. ఇక చిత్తూరు జిల్లా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
తప్పులు బయటపడతాయని గతంలో డాక్యుమెంట్లను కాల్చి వేయించారని, తాజాగా మరిన్ని అక్రమ దందాలు బయటపడుతున్నాయన్నారు. పెద్దిరెడ్డి ఏ శాఖ మంత్రిగా ఉంటే ఆ శాఖలోనే దందాలు నిర్వహించారని మంత్రి విమర్శించారు. మైనింగ్ శాఖతో రాష్ట్రంలోనే మైనింగ్ మొత్తం కబ్జా చేశారని ఆరోపించారు. అటవీ భూములను కబ్జా చేసిన ఘనత పెద్దిరెడ్డికే దక్కుతుందని, వీటన్నింటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.