Addanki Dayakar: బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే దేశంలో అభద్రతా భావంతో రాజకీయం చేస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. CLP మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు.
మోడీ మొహం చూపెట్టట్లేదు.. అమిత్ షా అడ్రస్ లేడు!
ఇటీవలి పరిణామాలతో బీజేపీలో అభద్రత స్పష్టంగా కనిపిస్తోందని అద్దంకి విమర్శించారు. ఒకప్పుడు ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చే ప్రధాని మోడీ ఇప్పుడు మొహం చూపించడం లేదన్నారు. అమిత్ షా అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. దేశంలో అందరూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే.. బీజేపీ మాత్రం RSS చెప్పే రాచరిక వ్యవస్థను రుద్దాలని చూస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ బంద్.. ఇక్కడ ర్యాలీలా?
ఢిల్లీలో నిరసనలు తెలిపే జంతర్ మంతర్‌ను కేంద్రం మూసివేసిందని, కానీ తెలంగాణలో ట్యాంక్ బండ్‌పై ర్యాలీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేసినట్లే బీజేపీ కూడా ప్రవర్తిస్తోందన్నారు. స్వయంగా దేశ హోంమంత్రే రోడ్డెక్కి ర్యాలీలు చేయడం చూస్తుంటే బీజేపీ ఒక అధికార పార్టీలా కాకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు.
13 కోట్ల ఓట్లు మాయం.. ఏం పీకుతున్నారు?
సర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు, 2018లో తెలంగాణలోనే 25 లక్షల ఓట్లు తీసేశారని ఆరోపించారు. ఒక్క తుంగతుర్తిలోనే 15 వేల ఓట్లు మాయం చేశారన్నారు. రోహింగ్యాలు, విదేశీయులు ఉన్నారనే సాకుతో ఓట్లు తొలగిస్తున్నామని చెబుతున్నారని, మరి కేంద్రంలో అధికారంలో ఉండి మీరేం పీకుతున్నారని ప్రశ్నించారు. జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య ఎలా తగ్గుతుందని నిలదీశారు.
తల్లి పాలు తాగి రొమ్ము చరిచారు!
అంబేద్కర్ పోరాడి సాధించిన ఓటు హక్కును బీజేపీ ఇష్టమొచ్చినట్లు పీకేస్తోందని అద్దంకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఓటుతోనైతే గెలిచి కుర్చీ ఎక్కారో, అదే ఓటును తొలగించడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము చరిచినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. సిగ్గు లేకుండా మాట్లాడే మోడీ, అమిత్ షాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ డిమాండ్.. గాంధీభవన్ వద్ద పోస్టర్లు