Addanki Dayakar: రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గాంధీభవన్‌లోని సీఎల్పీ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజీనామాతో రూపాయి ఉపయోగం లేదు
హరీష్ రావు పదే పదే రాజీనామా చేస్తానని చెప్తుండటంపై అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. విలువ ఉన్న నాయకుడు రాజీనామా చేస్తే సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందని, హరీష్ రావు లాంటి వారు రాజీనామా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కమిషన్లు తీసుకున్నందుకే ఆయనకు గతంలో మంత్రి పదవి ఇవ్వలేదని స్వయంగా వారి మరదలే బయటపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రీ-డిజైన్ పేరుతో కేసీఆర్ మోసం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిడీ హట్టి నుంచి చేవెళ్ల వరకు రావాల్సిన ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో పూర్తిగా పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. క్షుద్ర రాజకీయాలు చేసే ప్రాంతాల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డి చాకచక్యం.. సాధించిన విజయం
మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన నీటి చర్చలు ఘన విజయం సాధించాయని దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో చర్చలు సఫలం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి చూపిన సమయస్ఫూర్తి, చాకచక్యమే ప్రధాన కారణమని కొనియాడారు. మహారాష్ట్రతో మనకు ఎలాంటి గొడవలు లేవని, సిడబ్ల్యుసితో కూడా మాట్లాడి రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నీటి వాటాలు సాధించాలని రేవంత్ రెడ్డిని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డికి సహకరించండి..
రాజకీయాలు ఏవైనా ఉంటే కేవలం ఎన్నికల సమయంలోనే చూసుకోవాలని, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడీ హట్టి ప్రాజెక్టుపై మంచి సూచనలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి లేదా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read: ముద్దులు, హగ్గులతో ఓట్లు రావు.. వైసీపీకి మాస్ పంచ్ ఇచ్చిన మంత్రి టి.జి. భరత్!