Big Stories

MLA Vasantha : ఎన్నారైలను భయపెడితే ఎలా?.. ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి: వైసీపీ ఎమ్మెల్యే వసంత

MLA Vasantha : ఆయన ఏపీలో అధికారపార్టీ ఎమ్మెల్యే. టీడీపీ పేరు చెప్పినా, చంద్రబాబు మాట ఎత్తినా ఒంటికాలిపై లేస్తారు. ఇక దేవినేని ఉమాను రాయకూడని భాషలో విమర్శిస్తారు. అతనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈయన కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. మైక్ అందుకున్నారంటే టీడీపీ నేతల చెవులు పగిలిపోయేలా విమర్శనాస్త్రాలు సంధిస్తారు. అలాంటి నేత ఇప్పుడు అధికార పార్టీపైనే వాక్బాణం వదలడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

విషయంలోకి వెళితే .. గుంటూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆ రోజు కానుకలు పంపిణీ చేపట్టిన ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాకుడు ఉయ్యూరు శ్రీనివాస్ పై కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వసంత స్పందించారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. ఎన్నారైలను భయపెడితే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగైతే NRIలు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారని నిలదీశారు. ప్రవాసులతో దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ప్రవాసుల సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమన్నారు.

- Advertisement -

ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అని వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. తనకు చాలాకాలంగా స్నేహితుడని తెలిపారు. గుంటూరులో రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతో కావాలని శ్రీనివాస్‌పై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని పేర్కొన్నారు. గుంటూరు ఘటన అనంతరం ఎన్నారైలపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత ఇలా కౌంటర్ గా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు ఘటనపై వైసీపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ చర్యలను తప్పుబట్టడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది.

ఈ మధ్యనే జరిగిన మైలవరం నియోజకవర్గ సమీక్షలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై సీఎం జగన్ స్పష్టమైన హామీ వసంత కృష్ణప్రసాద్ కు ఇవ్వలేదు. మరోవైపు మంత్రి జోగి రమేష్ మైలవరం పై దృష్టిపెట్టారు. దీంతో వసంత, జోగి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ పంచాయితీని నియోజకవర్గ సమీక్షలో కొందరు కార్యకర్తలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తనకు టిక్కెట్ ఇవ్వరనే అభిప్రాయానికి ఎమ్మెల్యే వసంత వచ్చేశారా? అందుకే సరైన సమయం కోసం వేచిచూసి ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా?…

ఎవరీ ఉయ్యూరు శ్రీనివాస్..?
వర్జీనియాలో స్థిరపడిన ఉయ్యూరు శ్రీనివాసరావు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన ఆయన.. పేదలు, విద్యార్థులను ఆదుకునేందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ యూఎస్‌ఏ ఇన్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండేళ్ల చదువుకు 50 వేల డాలర్లను రుణంగా అందిస్తున్నారు. చదువు పూర్తై.. ఉద్యోగంలో చేరాక వారు అసలును తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. 2022 మే 28న కార్యక్రమాన్ని ప్రారంభించి 20 మందికి రుణాలు ఇచ్చారు. అలాగే గుంటూరులో 2, హిందూపురంలో 1 చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రోజూ 500 మందికి ఆహారం అందిస్తున్నారు.

తమ సొంత నియోజకవర్గంలో దసరా సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు పరీక్షలు నిర్వహించారు. జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల ద్వారా పేదలకు చేయూత ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెలలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్‌ అంబులెన్స్‌ ద్వారా మురికి వాడల్లో వైద్య సేవలు అందించబోతున్నామని శ్రీనివాస్ తెలిపారు. జనవరి 18న ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా 35 వేల మందికి అన్నదానం చేయాలని నిర్ణయించామన్నారు. అవసరమైన చోట శుద్ధ జల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు భాష అభివృద్ధికి గ్రంథాలయాల ఏర్పాటు, వేసవిలో క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇలా పలు కార్యక్రమాలను ఉయ్యూరు శ్రీనివాస్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News