Bosta vs Minister Kondapalli: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం కూటమి సర్కారులో అగ్గిరాజేస్తోంది. ఆయన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారని.. గత వారం రోజులుగా పొలిటికల్ వర్గాల్లో భారీగా ప్రచారం జరుగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాళ్లకు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. బొత్సను ఓడించిన సీనియర్ నేత.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి.. అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే.. బొత్సను గురువుగా చెబుతూ.. ఆయన కాళ్లకు మొక్కుతారా..? అని తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ.. ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించడానికే.. ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎయిర్ పోర్టులో తనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా కూటమి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.
Also Read: కడప రెడ్డెమ్మకు మంత్రి పదవి! మరో ముగ్గురి కథేంటి?
బొత్స సత్యనారాయణ ఎదురుపడగా సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా? అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తన తాత, బాబాయిలు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీపై పోటీ చేస్తూ, పోరాడుతూ వస్తున్నామన్నారు. అలాంటిది వారిని కాకా పట్టామనడం.. అసత్య ప్రచారమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కాళ్లకు దండాలు పెట్టాల్సిన అవసరం ఏముందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. సినీ ప్రముఖులపై మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ సీఎం జగన్ ను, ఇప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు సినిమా ప్రముఖులు వెళ్లి కలిశారని చెప్పారు. సినిమా రంగం వాళ్లు అవకాశ వాదులని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. సినిమాల బెనిఫిట్ షోలు కావాలని తాను చెప్పను..వద్దని చెప్పను.. ఏ నిర్ణయాన్ని కూడా తాను చెప్పనని బొత్స సత్యనారాయణ అన్నారు.
బొత్స కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలని అవకాశవాదులని అనడం పట్ల మండిపడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఎలా వేధించారో గుర్తు తెచ్చుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు. టికెట్ ధరల తగ్గింపు, హీరోలను అవమానించడం లాంటివి ఎన్నో చేశారని అంటున్నారు. మీలాగా పార్టీలు మారే అవకాశ వాదులం కాదని అంటున్నారు.