AP Cabinet :
⦿ ‘ఆరుగురు ఔట్’ సంచలన కథనం అక్షరాలా నిజం
⦿ ఏపీ రాజకీయాల్లో ‘స్వేచ్ఛ’ కథనం హాట్ టాపిక్
⦿ ఎవరా ఆరుగురు అంటూ మంత్రుల్లో టెన్షన్ మొదలు
⦿ సంక్రాంతికి ముందే ముగ్గురు, ఆ తర్వాత మరో ముగ్గురు
⦿ కేబినెట్ నుంచి తీసేయడానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు
⦿ ఆ ముగ్గురు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమకు చెందినవారే
⦿ ముగ్గురూ యువకులే, తొలిసారి గెలుపు, మంత్రి పదవి కూడా
⦿ ఎన్నిసార్లు చెప్పినా మారని తీరు, విసిగిపోయిన ముఖ్యమంత్రి
⦿ స్వయానా కాల్ చేసి హెచ్చరించినా ఏ మాత్రం రాని మార్పు
⦿ ఆ ముగ్గురి స్థానంలో ప్రస్తుతానికి ఇద్దరు ఫిక్స్, త్వరలో మరొకరు
⦿ నాగబాబు, పల్లా శ్రీనివాసరావు బెర్త్ కన్ఫామ్.. రేసులో మాధవీ రెడ్డి
⦿ జనవరి 8న ముహూర్తం అంటున్న ఏపీ సచివాలయ వర్గాలు!
స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నుంచి ‘ఆరుగురు పక్కా’ అంటూ ‘స్వేచ్ఛ’ ప్రచురించిన సంచలన కథనం అక్షరాలా నిజమైంది. ‘స్వేచ్ఛ’ చెప్పిందంటే వంద శాతం నిజమేనని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి. ఎవరా ముగ్గురు? ఎందుకు తొలగింపులు? అంటూ చర్చ నడుస్తుండటంతో, మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎక్కడ తమ పేరు ఉంటుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదుల సంఖ్యలో చెప్పినా పనితీరులో మార్పు రాకపోవడం, ఆ ఆరుగురి నిర్లక్ష్యంతో యావత్ ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక వారిని మంత్రివర్గం నుంచి తీసేయడే ఉత్తమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి ముందే ముగ్గుర్ని, ఆ తర్వాత మరో ముగ్గుర్ని పదవుల నుంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది. అంతేకాదు తొలుత తొలగించే ముగ్గురి స్థానంలో ఎవరెవరు మంత్రి కాబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చేసింది. ఇంతకీ పండుగ ముందు ఇంటికెళ్లే మంత్రులెవరు? వారి స్థానంలో వచ్చేదెవరు? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న హాట్ టాపిక్.
ఎవరా ముగ్గురు?
ముగ్గురు మంత్రుల్లో ఒకరు కోస్తాంధ్ర, మరొకరు ఉత్తరాంధ్ర, ఇంకొకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఈ ముగ్గురూ టీడీపీకి చెందిన వారే. అందులోనూ తొలిసారి టీడీపీ తరఫున గెలిచిన వారే. అలా లక్కీగా తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్న వాళ్లే. ముగ్గురూ యువకులే. ఏరికోరి మరీ యువకులు, ఉత్సాహవంతులు అని ఎంతో నమ్మకంతో కేబినెట్‌లోకి చంద్రబాబు తీసుకున్నారు. అయితే వారు ఏ మాత్రం ఆయన అంచనాలను అందుకోలేకపోవడం, కనీసం ఇచ్చిన శాఖలకు 25 శాతం కూడా న్యాయం చేయకపోగా, అవనసర విషయాలతో వార్తల్లో నిలవడం, అవినీతి అక్రమాలతో తన నమ్మకాన్ని వమ్ము చేశారని తీవ్ర అసహనం, అసంతృప్తితో సీఎం రగిలిపోతున్నారు.
దీనికి తోడు ఎన్నిసార్లు మంత్రివర్గంలో చెప్పినా, స్వయానా క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడినా, ఆఖరికి ఫోన్లు చేసి మాట్లాడి హెచ్చరించినా ఇసుమంత కూడా మార్పు రాకపోవడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక ఆ ముగ్గురిని పక్కనపెట్టాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ముగ్గురు యువ మంత్రుల దగ్గర ఉన్నది కీలక శాఖలు కావడమే ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి మొదటి కారణం.
మరో ముగ్గురు రెడీ..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్ ఫిక్స్ అయ్యింది. ఆయనకు ఏ శాఖ ఇస్తారనేదానిపై నిన్న, మొన్నటి వరకూ చర్చ జరిగినప్పటికీ సినిమాటోగ్రఫీ ఇస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు, పవన్ ఓ నిర్ణయానికి వచ్చారు కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ఈ శాఖ జనసేనకు చెందిన కందుల దుర్గేష్ దగ్గర ఉంది. అయితే ఇప్పుడు తొలగించబోయే మంత్రుల శాఖల సంగతేంటి? ఇందులోని శాఖలను నాగబాబుకు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది.
ఇక మిగిలిన ఇద్దరి విషయానికొస్తే ఒకరు పల్లా శ్రీనివాసరావు, మరొకరు కడప జిల్లాకు చెందిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డి రేసులో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి పల్లాను, కోస్తాంధ్ర నుంచి నాగబాబును, ఇక రాయలసీమ నుంచి మాధవీరెడ్డిని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని లీకులు వస్తున్నాయి. అంటే ఏయే ప్రాంతాల వారిని పక్కనెడుతున్నారో, ఆయా ప్రాంతాల నుంచి మరో ముగ్గుర్ని రెడీ చేస్తున్నారన్న మాట. వాస్తవానికి మాధవీని తొలిసారే కేబినెట్‌లోకి తీసుకోవాల్సినప్పటికీ సామాజిక సమీకరణల రీత్యా పక్కనపెట్టాల్సి వచ్చింది.
ముహూర్తం ఫిక్స్!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జనవరి 8న ముగ్గురు యువ మంత్రులను తొలగిస్తారని తెలిసింది. అదే రోజు లేదా ఆ మరుసటి రోజే మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని సచివాలయ వర్గాల చెబుతున్నాయి. ఇక నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఇక పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష పదవి మరో యువనేతకు ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిసింది. ఇక మాధవీరెడ్డి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా, సిటీ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతోనే గెలుపొందారు. ఇప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్ కూడా. కడప రెడ్డెమ్మ అని అందరూ పిలుచుకుంటున్నారు. జిల్లా వైసీపీ నేతలకు, ముఖ్యంగా మేయర్ సురేష్ బాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇన్నాళ్లుకు వైసీపీకి సరైన వ్యక్తి తగిలారనే చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో, మాధవీకి మరింత బూస్ట్ ఇస్తూ మంత్రి పదవి ఇస్తే మరింత చురుగ్గా పనిచేస్తారనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిసింది.
భయపడిపోతున్న మంత్రులు!
పండుగ ముందు ముగ్గుర్ని తొలగిస్తారు సరే, ఆ ముగ్గురు ఎవరనేది క్లారిటీ కూడా వచ్చేసింది. మరో ముగ్గురు సంగతేంటి? అని అందులో తమ పేర్లు ఉన్నాయేమో అని తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారు? సీనియర్లు సైతం వణికిపోతున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు రాయలసీమ నుంచి, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రా నుంచి మంత్రులైన వారే. శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం, కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం, ఇక లేనిపోని విషయాల్లో ఆ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తల్లో నిలవడం ఇలా ఒకట్రెండు కాదు లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఈ ముగ్గుర్నీ సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి నెలలో తొలగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ALSO READ : ఇక ప్రతి జిల్లాలోకి అందుబాటులో..?: ఏపీ డీజీపీ
ఈ క్రమంలో తమను తొలగించకుండా చూడాలని ఒకరిద్దరు మంత్రులు, మరోవైపు తమను కేబినెట్‌లోకి తీసుకోవాలని జూనియర్లు, సీనియర్లు సైతం అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి నారా లోకేశ్‌తో రాయబారాలు నడుపుతున్నారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ‘స్వేచ్ఛ’లో వచ్చిన వరుస కథనాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కథనాలు మంత్రివర్గంలోనే కాదు, రాజకీయ వర్గాల్లో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి.