Local Boyd elections: కారు పార్టీలో సీన్ రివర్స్ అయ్యిందా? ఎన్నికలంటే ఒకప్పుడు సిద్ధమేనని చెప్పే బీఆర్ఎస్.. ప్రస్తుతం ఆమడ దూరంగా ఎందుకుంటోంది? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేలా ప్లాన్ చేసిందా? రకరకాల పాచికలు ఎందుకు వేస్తోంది? కవితను తెరపైకి తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం అదేనా? అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి షురూ అయ్యింది. పార్టీలు ఇప్పుడు లోకల్ మూడ్‌లోకి వెళ్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసింది. అనుకున్న సమయానికి ఎన్నికలు జరిపాలని ఆలోచన చేస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని భావిస్తోంది. దీనివల్ల నిధుల సమస్య ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి చకచకా అడుగు లేస్తోంది అధికార పార్టీ.
సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్సీటీసీల పదవీకాలం ముగియడంతో స్థానిక సంస్థలు ఇన్‌ఛార్జీల పాలనలోకి వెళ్లాయి. అందుకే వేగంగా ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో ఉంది రేవంత్ సర్కార్. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆలోచన చేస్తోందట బీఆర్ఎస్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి వ్యతిరేకత ఉందని అంచనా వేసింది కారు పార్టీ. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ చేసింది. ఈ వ్యవహారం బీఆర్ఎస్‌కు దెబ్బపడడం ఖాయమన్నది ఆ పార్టీలో కొందరి నేతల మాట. రేపో మాపో రైతు భరోసా సైతం ఇస్తామని ప్రకటనతో బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కారుని మరింత డ్యామేజ్ చేస్తాయని అంటున్నారు.
ALSO READ: షాకింగ్ ట్విస్ట్.. ఆ ముగ్గురి మరణం వెనుక.. నాలుగో వ్యక్తి..?
ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్నది కేసీఆర్ ప్లాన్. ఈ క్రమంలో కవితను తెరపైకి తెచ్చారు. కవిత ఆధ్వర్యంలో యాక్టివేట్ అయ్యింది తెలంగాణ జాగృతి సంస్థ. జిల్లాలకు చెందిన సంఘాలపై కవిత భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదన్నది జాగృతి ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో బీసీ వాయిస్‌ని తెరపైకి తెచ్చారు.
బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కవిత. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలు నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతోందని మెలిక పెట్టారు. అంతేకాదు హైదరాబాద్‌లో భారీ ఎత్తున బీసీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
హైదరాబాద్ వేదికగా జరగనున్న సభలో బీసీ గళం వినిపించాలన్నది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. అసలు ఈ ఉద్యమాన్ని బీసీ నేతలకు కాకుండా కవిత ఎత్తుకోవడం ఏంటని ప్రశ్నలు ప్రత్యర్థుల నుంచి పడిపోయతున్నాయి. గడిచిన పదేళ్లు ఏం చేశారంటూ అధికార పార్టీ నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. ఎటుచూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీకి కష్టాలు తప్పవన్నది విశ్లేషకుల మాట.