ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబు నేరుగా చంద్రబాబుని కలిశారు. వారిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానంటూ నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సంక్షేమం, జవాబుదారీతనం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా తన కర్తవ్యాలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానన్నారు. చట్ట సభలో ప్రజా ప్రతినిధిగా ప్రజాగళం వినిపించే అవకాశం తనకు లభించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు నాగబాబు.
శ్రీ @ncbn గారు, శ్రీ @PawanKalyan గారు అప్పజెప్పిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను – @NagaBabuOffl pic.twitter.com/LNKHZZX8Pw
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2025
ఆసక్తికర సన్నివేశం..
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబు తన సతీమణి పద్మజతో కలసి సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. అనంతరం చంద్రబాబు కూడా నాగబాబు దంపతులకు వెంకటేశ్వర స్వామి మొమెంటో ఇచ్చి అభినందించారు. నాగబాబు సంతోషం వ్యక్తం చేయగా, చంద్రబాబు భుజం తట్టి ప్రోత్సహించారు. ఆప్యాయంగా ఆయనతో మాట్లాడారు.
శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన శ్రీ నాగబాబు గారు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన… pic.twitter.com/Kp9AtBqPO9
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2025
మంత్రి పదవి ఎప్పుడు..?
నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందే మంత్రి పదవికోసం అనే ప్రచారం ఉంది. ఆయనకు మొదట్లో టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. చివరకు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఆయన్ను మంత్రిని చేయడానికే ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో నాగబాబుని మంత్రి వర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఆల్రడీ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేనకు సీట్ల దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇచ్చారు. ఇక నాగబాబుకి స్పెషల్ కేటగిరీలో మంత్రి పదవి ఇస్తారేమో చూడాలి. అదే జరిగితే.. కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ అరుదైన రికార్డ్ అందుకున్నట్టవుతుంది. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మిగతా ఇద్దరు తమ్ముళ్లు మంత్రులుగా ఉన్నట్టవుతుంది.
ఫైర్ బ్రాండ్..
నాగబాబుకి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. గతంలో టీడీపీని విమర్శించిన సందర్భాల్లో కూడా ఆయన తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేవారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి, వైరి వర్గం వైసీపీపై ఆయన విమర్శలతో విరుచుకుపడే అవకాశముంది. ప్రెస్ మీట్లలో చేసే ఆరోపణలు వేరు, రేపు ఎమ్మెల్సీగా ఆయన మండలిలో ఇచ్చే ప్రసంగం వేరు. మండలిలో ప్రజల తరపున తన గొంతు వినిపిస్తానంటున్న నాగబాబు.. వైసీపీని ఎలా టార్గెట్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం మండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉంది. జగన్ సహా ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి రావట్లేదు. కాస్తో కూస్తో శాసన మండలిలోనే వైసీపీ వాయిస్ వినపడుతోంది. వారిని టార్గెట్ చేయడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కూడా రంగంలోకి దిగే అవకాశముంది.
నాగబాబు ఇప్పటి వరకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రెస్ మీట్లలో పార్టీ తరపున ఆయన పెద్దగా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఆయన పార్టీ తరపున తన వాయిస్ వినిపించే అవకాశముంది. ప్రస్తుతం జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ పేరు వినపడుతోంది. ఎమ్మెల్సీ అయిన నాగబాబు పార్టీలో సెకండ్ ప్లేస్ కి వస్తారా, లేక తనకిచ్చిన విధుల్ని మాత్రమే నిర్వర్తిస్తారా అనేది వేచి చూడాలి.