ఏపీలో కూటమి పార్టీల మధ్య సయోధ్య ఉందని, ఉంటుందని పదే పదే అధినేతలు చెబుతున్నారు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ విడాకులు మాత్రం కుదరవని ఉన్న పరిస్థితిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు లోకేష్. కానీ నాగబాబు కనపడితే మాత్రం అటు టీడీపీలో, ఇటు జనసేనలో కూడా ఒకరకమైన ఉత్సాహం కనపడుతోంది. ఆ ఉత్సాహం కూటమికి మంచి చేస్తుందా, లేక చేటు తెస్తుందా అనే విషయం పక్కనపెడితే.. నినాదాలు హోరెత్తిపోతున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పర్యటించారు. ఎమ్మార్వో కార్యాలయం, అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జై వర్మ, జై టీడీపీ, జై జనసేన నినాదాలు పోటాపోటీగా వినపడ్డాయి. మిగతా వాళ్లు పర్యటించినా పెద్దగా సందడి కనపడదు కానీ, ఎందుకో నాగబాబుని చూస్తేనే అటు, ఇటు రెండు వర్గాలు కాస్త రెచ్చిపోడానికి ఉత్సాహం చూపిస్తాయి.
పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ
• నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు
• గొల్లప్రోలు తాగునీటి సరఫరా కేంద్రంలో పూర్తయిన అభివృద్ధి పనులు
• గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం
పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి… pic.twitter.com/xhqw7F3kJ6
— JanaSena Party (@JanaSenaParty) April 4, 2025
వర్మతో కోల్డ్ వార్..
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మతో జనసేనకు కోల్డ్ వార్ జరుగుతోందనే విషయం తెలిసిందే. పవన్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా, ఆయన గెలుపుకోసం కూడా ప్రచారం చేశారు వర్మ. తీరా పవన్ గెలిచిన తర్వాత వర్మకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదు. పైగా టీడీపీ అధిష్టానం కూడా ఎమ్మెల్సీ హామీని ఇప్పటికిప్పుడు నిలబెట్టుకోలేకపోయింది. దీంతో అక్కడ వర్మ స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారు. ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. కూటమిలో కలవకుండా తాను సొంతగా టీడీపీ తరపున పర్యటనలు చేస్తున్నారు. స్థానికంగా అభివృద్ధి అనుకున్నట్టుగా జరగడంలేదని ఆయన ప్రొజెక్ట్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.
వర్మతో పనిలేదు..
వర్మ విషయంలో జనసేన ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. పిఠాపురంలో పవన్ గెలుపు అనేది ఎవరి సహకారం వల్లో సాధ్యం కాలేదని, అక్కడ జనసేనకు బలం ఉందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. జనసేన ఆవిర్భావ సభలో కూడా పరోక్షంగా నాగబాబు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేశారు. సో ఇక్కడ వర్మని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు జనసేన నేతలు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ తో కలసి హాజరయ్యారు వర్మ. పవన్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా పెత్తనం తనకే ఉంటుందని ఆయన ఆశపడ్డారు. కానీ అది కుదరలేదు సరికదా, అసలిప్పుడు జనసేన నేతలు వర్మని పట్టించుకోవడం కూడా మానేశారు. దీంతో ఆయన సొంత రాజకీయం చేసుకుంటున్నారు. ఎంత కాదన్నా పిఠాపురంలో టీడీపీకి కూడా బలం ఉంది, వర్మకి కూడా అభిమానులన్నారు. వారంతా జనసేన కార్యక్రమంలో కలసిపోయి జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. తాజాగా నాగబాబు పర్యటనలో కూడా అదే జరిగింది. కానీ ఆయన చూసీ చూడనట్టు వెళ్లిపోయారు. మరోసారి జనసేన కార్యక్రమాల్లో టీడీపీ వారికి ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి.
నాగబాబు కనపడితేనే..
ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య యుద్ధం మొదలైందని అనుకోలేం. పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తే టీడీపీ నేతలు కూడా కలసి వెళ్తారు. కానీ నాగబాబు వచ్చేసరికి మాత్రం వారిలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతోంది. టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత నాగబాబు ఇలాంటి నినాదాలకు స్పందిస్తారా, లేక తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ కామెంట్లు మొదలు పెడతారా అనేది చూడాలి.