రివ్యూ : హోమ్ టౌన్ వెబ్ సిరీస్
తారాగణం : రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాదం, యానీ తదితరులు
దర్శకుడు : శ్రీకాంత్ రెడ్డి పల్లె
నిర్మాతలు : శేఖర్ మేడారం, నవీన్ మేడారం
ఓటీటీ : ఆహా
Home Town Web Series Review : ‘హోమ్ టౌన్’ అనే వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈరోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ను, ’90s : ఎ మిడిల్ క్లాస్’ బయోపిక్’ నిర్మాతలు నిర్మించారు. అయితే ట్రైలర్ తోనే ఈ సిరీస్ అచ్చం ’90’ సిరీస్ ను దింపినట్టుగా ఉందనే విమర్శలు విన్పించాయి. మరి ఈ సిరీస్ ద్వారా మేకర్స్ విమర్శలకు సమాధానం చెప్పారా ? ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ను ఈ సిరీస్ అందుకోగలిగిందా? అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ
2003 సంవత్సరంలో తెలంగాణలోని హనుమంతుల గూడెం అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగుతుంది ‘హోమ్ టౌన్’ సిరీస్ కథ. ప్రసాద్ (రాజీవ్ కనకాల) ఒక మధ్యతరగతి తండ్రి. ఆయన తన భార్య (ఝాన్సీ), పిల్లలు శ్రీకాంత్ (ప్రజ్వల్ యాదం), జ్యోతి (యానీ)లతో సింపుల్ గా జీవితాన్ని గడుపుతాడు. తనకున్న ఒక చిన్న ఫోటో స్టూడియో వారి ఏకైక ఆదాయ మార్గం. కొడుకు శ్రీకాంత్ ను బాగా చదివించి, విదేశాలకు పంపి సెటిల్ చేయాలనేది ఆ తండ్రి కోరిక. కానీ శ్రీకాంత్ కు చదువు అంతగా ఎక్కదు. కానీ అతని సోదరి మాత్రం చదువులో అదరగొడుతుంది. ఇక ప్రసాద్ కొడుకును విదేశాలకు పంపాలి అనుకుంటే… కొడుకు, తల్లి మాత్రం ఉన్న ఊర్లోనే సెటిల్ అయితే బాగుంటుందని అంటారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోడు. మరోవైపు బాగా చదువుతున్న కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. మరి అనుకున్నట్టుగానే కూతురికి పెళ్లి చేసి పంపాడా? కొడుకు విదేశాలకు వెళ్లాడా? చదువుల తల్లి అయిన చెల్లి కోసం శ్రీకాంత్ ఏం చేశాడు? అనేది ఆహాలో ‘హోమ్ టౌన్’ను చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
90ల నేపథ్యంలో నడిచే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇప్పటికే ప్రేక్షకులు చూశారు. ముఖ్యంగా ’90’ వెబ్ సిరీస్ ఎఫెక్ట్ ఇప్పటికీ ప్రేక్షకుల మీద ఉంది. అయితే 90ల నాటి నాస్టాల్జిక్ అంశాలను ఆస్వాదించేవారు కథతో కనెక్ట్ అయిపోవచ్చు. కానీ ఇప్పటికే 90ల నాటి సినిమాలు, సిరీస్‌లను చూసిన ప్రేక్షకులకు ఈ సిరీస్ రొటీన్‌గా అనిపించవచ్చు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లె కథను చాలా వరకు బాగానే హ్యాండిల్ చేసాడు. సిరీస్‌లోని కొన్ని అంశాలు కొంచెం నీరసంగా, మరికొన్ని రొటీన్‌గా అనిపిస్తాయి. దర్శకుడు నటీనటుల నుండి మంచి నటనను రాబట్టుకోగలిగాడు. కానీ కథ చెప్పడంపై ఎక్కువ దృష్టి పెడితే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్ లు మాత్రమే ఉన్నాయి. వాటి రన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ఎపిసోడ్‌లు అనవసరంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు బాగున్నాయి. రెండవ ఎపిసోడ్ లో కామెడీ చక్కగా పండింది. ఫేస్ బుక్ ఎపిసోడ్ బాగుంది. ఒకే తరగతిలో చదువుతున్న అన్నా చెల్లెళ్ళు, వారి విద్యా వ్యవస్థ గురించిన లైన్ లాజిక్ లెస్ గా అన్పిస్తుంది. క్లైమాక్స్ లో రాజీవ్ కనకాల, ప్రజ్వల్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ పెద్దగా పండలేదు.
యువ నటులు ప్రజ్వల్, సాయి రామ్, అనిరుధ్ తమ నటనతో ఆకట్టుకుంటారు. ఈ ముగ్గురితో కూడిన కామెడీ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సాయి రామ్, అనిరుధ్ కామెడీ టైమింగ్ బాగుంది. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న అమాయకపు , కష్టపడి పని చేసే మధ్యతరగతి తల్లిదండ్రులుగా ఝాన్సీ, రాజీవ్ కనకాల యాక్టింగ్ బాగుంది. ప్రజ్వల్ పరవాలేదు అన్పించాడు. యానీ ఎమోషనల్ సీన్స్ లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటనను మర్చిపోలేరు.
‘హోమ్ టౌన్’ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ విభాగం 2003 ల కాలాన్ని చాలా బాగా రీక్రియేట్ చేసింది. సురేష్ బొబ్బిలి సంగీతం, దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కార్తిక్ ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది.
చివరగా
‘హోమ్ టౌన్’లో ’90s’సిరీస్ షేడ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్టోరీ వేరైనా, కామెడీ సన్నివేశాలు కొంతవరకు ఎంగేజ్ చేయగలిగినప్పటికీ చాలా వరకు ఇందులో ఉన్న సీన్స్ అదే సిరీస్ ను గుర్తు చేస్తాయి. అయితే ’90s’ సిరీస్ రేంజ్ లో ఇది రుచించదనే చెప్పాలి. అంచనాలు పెట్టుకుని చూశారంటే డిసప్పాయింట్ అవ్వడం పక్కా. అలాగే ఫ్యామిలీ మొత్తం ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడగలిగే సిరీస్ ఇది.
Home Town Web Series Rating : 1.5/5