PM Modi: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శత్రువులెవరూ లేరిక్కడ. అంతా మిత్రులే. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు. జగన్-పవన్.. మధ్యలో మోదీ. ఈ ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ భలే ఆసక్తిగా ఉంది. ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఉంది. పవన్-మోదీల మధ్య మంచి స్నేహం ఉంది. అదే సమయంలో జగనంటే పవన్ కు అసలేమాత్రం పడదు. అలాంటి జగన్ తోనూ మోదీ సత్సంబంధాలు నెరపుతున్నారు. మోదీ చేస్తున్నారని అనడంకంటే.. జగన్, పవన్ లే మోదీ కోసం పాకులాడుతున్నారనడం కరెక్ట్ కావొచ్చు.
ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఒకే పర్యటనతో రెండు పార్టీలు బుట్టలో పడేలా సాగిందా టూర్. ముందు పవన్ తో వన్ టు వన్ మీటింగ్. రాష్ట్ర అంశాలపై సుదీర్ఘ చర్చ. నేనున్నానంటూ.. జనసేనానికి మోదీ హామీ. మనం మనం ఒకటే అనేలా బీజేపీ-జనసేన పొత్తుకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదంటూ ఇండికేషన్. ఇలా చాయ్ వాలాతో చాయ్ గ్లాస్ బంధం ధృఢమైనదే అనిపించేలా చేశారు నరేంద్ర మోదీ.
కట్ చేస్తే, అదే మోదీ. ఈసారి పవన్ ప్లేస్ లోకి జగన్ వచ్చారు. వన్ టు వన్ కాకపోయినా.. పబ్లిక్ మీటింగ్ లో పక్కపక్కనే కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. వేదికపై ప్రధానిని కొనియాడుతూనే, మన బంధం రాజకీయాలకు అతీతమంటూ.. స్నేహగీతం ఆలపించారు జగన్. విశాఖ సభ ఫుల్ సక్సెస్. ఆ సక్సెస్ కు మెయిన్ రీజన్ వైసీపీనే. మోదీ మీటింగుకు లక్షలాదిగా జనాన్ని తరలించింది అధికారపార్టీనే.
ప్రధాని మోదీ రెండు రోజుల విశాఖ పర్యటన.. ఏపీ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తోంది? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీ.. జనసేన వైపు మొగ్గు చూపుతోందా? లేదంటే, వైసీపీతో పరోక్ష స్నేహం చేసేందుకే సై అంటోందా? పరిస్థితిని బట్టి ఎవరైతే వాళ్లు అనుకుంటోందా?
ఇక, వైసీపీ జనసేనలు వారి వార్ ను అలానే కంటిన్యూ చేస్తున్నాయి. పవన్ మోదీతో భేటీ కాగానే.. ‘మోదీతో మీటింగ్.. చంద్రబాబుతో డేటింగ్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ లో రచ్చ స్టార్ట్ చేశారు. అది అలా అలా పెరుగుతూనే ఉంది. అటు, జనసేన సైతం తగ్గేదేలే అంటూ వైసీపీకి సవాళ్లు విసురుతోంది. రుషికొండ బీచ్ తవ్వకాలను పవన్ కల్యాణ్ పరిశీలించి.. పోరు ఆపేదేలే అనేలా మెసేజ్ ఇచ్చారు. ఇలా వైసీపీ, జనసేనల వైరం మరింత ముదురుతుండగా.. ఆ రెండు పార్టీలు బీజేపీ కోసం ఆరాటపడుతుండటం ఆసక్తికరం. ఇదంతా మోదీ మైండ్ గేమ్ అంటున్నారు.