Montha Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కారణంగా ఏపీ-తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం, బుధవారాల్లో వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీని కారణంగా ఏపీలోని వివిధ జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
దూసుకొస్తున్న మొంథా తుపాను
ఏపీలోని కోస్తా జిల్లాలపైకి మొంథా తుపాను దూసుకొస్తోంది. ఆదివారం సాయంత్రానికి పోర్టు బ్లెయిర్‌కు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం నాటికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారి రాత్రికి కాకినాడ తీరం దాటుతుందని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ.
ఆ తర్వాత తుపాను బలహీనపడొచ్చని తెలిపింది. దీని కారణంగా సోమవారం నుంచి గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అంతేకాదు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తుపాను నేపథ్యంలో సోమవారం 7 జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.
తీరప్రాంతాలు అలర్ట్.. పాఠశాలలకు సెలవులు
దూసుకొస్తున్న మొంథా తుపాను కారణంగా ఏపీ ప్రభుత్వం అలర్టయ్యింది. ఇప్పటికే పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మొంథా తుపాను నేపథ్యంలో ఏపీలో 22 జిల్లాల పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. మూడు నాలుగు జిల్లాలకు తప్పితే అన్ని జిల్లాలకు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు ఇచ్చింది.
ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు.
ALSO READ: ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. రంగంలోకి పోలీసులు
తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్స కారులు వేటకు వెళ్లరాదని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు బీచ్‌లను అధికారులు మూసి వేశారు. ఇక విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
తుపాను నేపథ్యంలో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వివిధ జిల్లాలకు తరలివెళ్లాయి. మరికొన్ని బృందాలు హెడ్‌క్వార్టర్స్‌లో రెడీగా ఉన్నాయని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రభుత్వం వివిధ శాఖల అధికారులకు సెలవులు రద్దు చేసింది. సహాయక చర్యల నిమిత్తం రూ.19 కోట్లు విడుదల చేసింది.
ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు సిద్ధం చేసింది. సముద్రంలో 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించనుంది. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ తుపాను ప్రభావం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని పేర్కొంది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.#Weather #Cyclone #AndhraPradeh #APSDMS #NDRF #SDRF #Rains #HeavyRains… pic.twitter.com/ieH91EaymD
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 27, 2025