ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో నాగబాబుకి పిఠాపురంలో ప్రోటోకాల్ అదిరిపోతోంది. అదే సమయంలో స్థానికి నేత వర్మ వర్గం ఆయనపై రగిలిపోతోంది. నాగబాబు పర్యటనలో జై వర్మ, జై తెలుగుదేశం అనే నినాదాలు మారుమోగిపోతున్నాయి. వీరికి పోటీగా జనసైనికులు కూడా నినాదాలు హోరెత్తిస్తున్నారనుకోండి. ఇలాంటి టైమ్ లో శిలా ఫలకం వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అన్న క్యాంటీన్ ని ప్రారంభిస్తూ నాగబాబు వేసిన శిలా ఫలకంలో సీఎం చంద్రబాబు పేరు మిస్ అయింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని అనుకోలేం, అలాగని ఈ పొరపాటుని టీడీపీ వాళ్లు లైట్ తీసుకుంటారని కూడా అనుకోలేం. అవును, టీడీపీ ఇప్పుడు శిలాఫలకం గురించి రచ్చ చేస్తోంది. సీఎం చంద్రబాబు పేరు ఎందుకు మిస్ అయిందంటూ సోషల్ మీడియాలో గొడవ చేస్తోంది.
నిన్ననే కొత్తగా ఎన్నికైన MLC నాగబాబు గారు ఈరోజు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ శిలాఫలకం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది 😒😒
15 ఏళ్ళు పొత్తు కొనసాగాలని చెప్పిన తమ్ముడి మాటలకి కూడా విలువ లేదా 🙏🙏
స్వప్రయోజనాలు, కుల… pic.twitter.com/xflrTh27oT
— Red Book (@RedBook_TDP) April 4, 2025
వర్మబ్యాచ్ అలక
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మ బ్యాచ్ చేస్తున్న గొడవను పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ అయినా కూడా.. నాగబాబుని కానీ, పవన్ కల్యాణ్ ని కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకుంటే అధిష్టానం చూస్తూ ఊరుకోదు. కూటమిలో లుకలుకలను ఇటు చంద్రబాబు కానీ, అటు పవన్ కానీ సహించేలా లేరు. అంటే వర్మ మరింత దూకుడుగా ఉంటే కచ్చితంగా ఆయనపై చర్యలుంటాయి. అదే సమయంలో ఇటు జనసేన వర్గం కూడా రెచ్చగొట్టకుండా ఉండాలని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో.. పిఠాపురం విజయానికి కారకులెవరంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాగబాబు వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుందేమోననే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే నాగబాబు టార్గెట్ టీడీపీ కాదని, కేవలం వర్మ మాత్రమేనని తేలిపోయింది.
శిలా ఫలకం రచ్చ
వర్మ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. పిఠాపురంలో తానే సొంతగా పర్యటిస్తూ, స్థానిక సమస్యలను హైలైట్ చేస్తున్నారు వర్మ. నాగబాబు పర్యటనలో వర్మ అనుచరులు పెద్ద సీన్ క్రియేట్ చేశారు కూడా. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్న ఈ టైమ్ లో నాగబాబు ప్రారంభించిన శిలా ఫలకం మరింత పెద్ద చర్చనీయాంశమవుతోంది.
అది అగౌరవమే..
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబు నేరుగా సీఎం చంద్రబాబుని కలిశారు. ఆయనతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఆ గౌరవం పిఠాపురంలో వేసిన శిలాఫలకంలో మాత్రం కనపడలేదని టీడీపీ వర్గాలంటున్నాయి. శిలాఫలకంలో సీఎం పేరు లేకపోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తున్నారు. పోనీ ఆ కార్యక్రమానికి హాజరైన వారి పేర్లు మాత్రమే ఉన్నాయా అంటే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాకపోయినా ఆయన పేరు అక్కడ ప్రముఖంగా కనపడుతోంది. దీంతో టీడీపీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.
ఎవరికి లాభం..?
ఏపీలో కూటమి మధ్య చిచ్చు మొదలైతే.. రాజకీయంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంలో ఉంది వైసీపీ. అందుకే ఇటు వర్మని, అటు కొలికపూడిని రెచ్చగొడుతూ వైసీపీ అనుకూల మీడియా ఆర్టికల్స్ ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా టీడీపీ, జనసేన మధ్య గొడవలు మొదలయ్యేలా ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. దాన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన అధినాయకత్వం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా సమన్వయం చెడకుండా చూసుకోవాలి. కానీ నాగబాబు పర్యటనతో రెండు పార్టీల మధ్య భావోద్వేగ వాతావరణం నెలకొంది. సీఎం పేరు లేని శిలాఫలకం దానికి మరింత ఆజ్యం పోస్తోంది.