
Nara Bhuvaneswari : తిరుపతి జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. “నిజం గెలవాలి” పేరుతో బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి యాత్ర చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో రెండు మండలాల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రగిరిలో ఎ.ప్రవీణ్ రెడ్డి, నేండ్రగుంటలో కె. చిన్నబ్బ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులకు చెరో రూ.3 లక్షల చెక్కులను అందజేశారు.
ధైర్యంగా ఉండాలని, టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత టీడీపీనే తీసుకుంటుందని తెలిపారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద జరిగే బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసంగించనున్నారు. కాగా.. వారంలో మూడురోజుల పాటు “నిజం గెలవాలి” యాత్ర జరగనుంది. యాత్ర నిర్వహించిన ప్రాంతాల్లో జరిగే సభలు, సమావేశాల్లో నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారు.
చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పటి వరకూ బీజేపీతో కలిసి పోటీచేస్తుందనుకున్న జనసేన.. టీడీపీతో పొత్తు ప్రకటించింది. సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో బాబు బెయిల్ పిటిషన్లపై వాదోపవాదాలు.. వాయిదాల పర్వాల నడుమ నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” అనే యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.