
Sri Simha Marriage : ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బాణీలు కట్టిన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయని రెండ్రోజులుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కీరవాణి చిన్నకొడుకు, నటుడు శ్రీసింహా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడంటూ వార్తలొస్తున్నాయి. మొదటి సినిమా.. మత్తు వదలరా తో ఫస్ట్ హిట్ అందుకున్న శ్రీసింహా.. ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా..ఆ సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా.. కీరవాణి-వెంకటేష్ లు వియ్యంకులు కాబోతున్నారని, వెంకటేష్ కూతురికి – శ్రీసింహాకు పెళ్లి జరగనుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. శ్రీసింహా అల్లుడయ్యేది దగ్గుబాటివారి కుటుంబానికి కాదట. అంతకుమించి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
నటుడు, రాజకీయ నాయకుడైన మాగంటి మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో శ్రీసింహా పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. పారు ధనవంతుల జాబితాలో ఉన్నవారిలో మురళీమోహన్ ఒకరు. ఆయన కొడుకు రామ్ మోహన్ కుమార్తెనే ఈ రాగ. విదేశాలలో ఐఎస్ బీ లో మాస్టర్స్ పూర్తి చేసి.. ప్రస్తుతం ఇండియాలో తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటోంది. అయితే.. ఇది లవ్ మ్యారేజ్ అనుకుంటే పొరపాటే. పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమే. లవ్ మ్యారేజ్ అనుకోవడంలో తప్పులేదు.. ఎందుకంటే.. సింహా కన్నా పెద్దవాడైన కాలభైరవ ఉండగా.. చిన్నకొడుక్కి పెళ్లి చేస్తుండటంతో లవ్ మ్యారేజ్ అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా.. త్వరలోనే ఈ రెండు కుటుంబాలు వీరి పెళ్లిని అధికారికంగా చెప్పనున్నాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మురళీమోహన్ ఇంటి అల్లుడిగా శ్రీసింహా నటనను కొనసాగిస్తాడా ? లేక వ్యాపారాల్లో భాగమవుతాడా ? అనేది చూడాలి.
మరి వెంకటేష్ రెండో కూతురి సంగతేంటి అంటారా.. విజయవాడకు చెందిన పెద్ద డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయనున్నారని సమాచారం. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేదు. ఫ్యామిలీ కూడా మాంచి సౌండ్ పార్టీ అని టాక్ వినిపిస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీని మించిన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.